తెలుగుదేశం పార్టీకి మరో సిట్టింగ్ ఎంపీ గుడ్ బై చెప్పారు. అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఆయన రేపో , మాపో వైసీపీలో చేరే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో అమలాపురం లోక్‌సభ టిక్కెట్ ఇవ్వబోమని చెప్పారని.. అందుకే పార్టీ మారుతున్నానని ఆయన ప్రకటించారు. 2014 ముందు వరకు .. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ఉద్యోగిగా ఉన్న… రవీంద్రబాబు.. గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి.. లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నారు. అయితే.. ఈ సారి.. అమలాపురం లోక్‌సభ బరిలో… తెలుగుదేశం పార్టీ… మాజీ లోక్‌సభ స్పీకర్… గంటి మోహనచంద్ర బాలయోగి కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించుకుంది. బాలయోగి కుమారుడు హరీశ్ మాధుర్ పేరును చంద్రబాబు ఖరారు చేశారని అంటున్నారు. ఈ విషయంలో రవీంద్రబాబుకు చెప్పారని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
బాలయోగి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించే నాటికి ఆయన పిల్లలు బాగా చిన్నవారు. కోనసీమ ప్రజలకు ఆరాధ్యుడిగా ఉన్న బాలయోగి కుటుంబం నుంచి ఇంకెవరూ రాజకీయాల్లో లేరు. గత ఎన్నికల సమయానికి కూడా వారు.. పోటీకి అర్హత సాధించే వయసుకు రాలేదు. ఈ సారి బాలయోగి పెద్దకుమారుడు.. పోటీ చేసే అర్హత సాధించారని.. వారిని రాజకీయాల్లోకి ప్రొత్సహించాలని చంద్రబాబు నిర్ణయించారని చెబుతున్నారు. అయితే.. గంటి హరీష్‌ను.. లోక్‌సభకు పోటీ చేయించాలా.. అసెంబ్లీకి నిలబెట్టాలా.. అన్న విషయంపై..ఇప్పటికీ.. క్లారిటీ లేదు. కానీ.. పండుల రవీంద్రబాబుకు మాత్రం.. టిక్కెట్ లేదని .. చెప్పేశారు.
ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు బాలయోగి రాజకీయ గురువు. అందుకే.. బాలయోగి కుమారుడి రాజకీయ ఆరంగేట్రాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో అమలాపురంలో.. హరీష్ పేరుతో.. కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో లోక్‌సభకే… బాలయోగి కుమారుడి పేరు ఖరారు కావొచ్చని ప్రచారం జరుగుతోంది.