ఓ డిజాస్టర్ వస్తే చాలు.. ‘స్టార్’ హోదా ఢాం అంటుంటుంది. మరీ ముఖ్యంగా దర్శకుల విషయాల్లో నమ్మకాలు తగ్గిపోతాయి. బోయపాటి శ్రీను విషయంలో ఇదే జరిగింది. నిన్నా మొన్నటి వరకూ బోయపాటి ఓ స్టార్ దర్శకుడు. బోయపాటి సినిమా అంటే ‘తిరుగులేదు’ అన్న ఫీలింగే ఎక్కువ. కానీ ‘వినయ విధేయ రామ’తో లెక్కలన్నీ మారిపోయాయి. తనది కాని రోజున బోయపాటి ఎంత ఘనమైన ఫ్లాప్ ఇవ్వగలడో ఈ సినిమా నిరూపించింది. ఆ ఫ్లాప్ ప్రభావం బోయపాటిపై గట్టిగానే పడింది. మరీ ముఖ్యంగా పారితోషికం విషయంలో.
బోయపాటి పారితోషికం అక్షరాలా 15 కోట్లు. వినయ విధేయ రామకి తను అందుకున్న మొత్తం ఇది. అన్నట్టు ఈ 15 కోట్లు నికర మొత్తం. టాక్సులన్నీ.. నిర్మాత భరించాల్సిందే. అయితే ఈ పారితోషికంలో భారీ కోత కనిపిస్తోందిప్పుడు. బోయపాటి తరువాతి సినిమా బాలకృష్ణతో. ఏప్రిల్‌లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ చిత్రానికి బాలయ్యే నిర్మాత. సింహాకి బోయపాటి అందుకున్న పారితోషికం రూ3 కోట్ల లోపే. ఆ తరవాతే.. బోయపాటి రేంజు మారింది. లెజెండ్కి రూ.6 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు కాస్త అటూ ఇటుగా ఆ పారితోషికాన్నే బోయపాటికి ఫిక్స్ చేశాడట బాలకృష్ణ. ఇది బాలయ్య సొంత సినిమా. ఆయన ఇచ్చింది తీసుకోవాల్సిందే. పైగా.. `వినయ విధేయ రామ` డిజాస్టర్ ప్రభావం తన కెరీర్‌పైనా పడిందని బోయపాటికి తెలుసు. అందుకే ఈ పారితోషికానికే బోయపాటి ఫిక్సయ్యాడని సమాచారం.