తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో… హరీష్ రావు, కేటీఆర్‌లకు చోటు కల్పించకపోవడంపై రాజకీయవర్గాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో వారిద్దరికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నందున… వారికి పదవులు ఇవ్వలేదని..ఆ తర్వాత వారిద్దరికి చోటు ఉంటుందని.. పలు చొప్పుకొస్తున్నారు. నిజంగానే పార్లమెంట్ ఎన్నికల కారణంగా.. హరీష్ , కేటీఆర్‌లకు.. కేబినెట్లో చోటు దక్కలేదా..? దానికి వేరే రాజకీయం ఉందా..?
కేటీఆర్‌ను తీసుకోకపోవం పక్కన పెట్టడం కాదు..!
మంత్రి వర్గంలోకి కేటీఆర్‌తో పాటు హరీష్‌ను కూడా తీసుకోలేదని చెబుతున్నారు. కానీ.. కేటీఆర్‌ను తీసుకోకపోవడం వేరు.. హరీష్‌రావును తీసుకోకపోవడం వేరు. కేటీఆర్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మెరుగైన సీట్లు సాధించి.. ఢిల్లీలో చక్రం తిప్పే పరిస్థితి వస్తే.. కేసీఆర్… హస్తిన రాజకీయాలకు వెళ్తారు. ఇక్కడ కేటీఆర్ పట్టాభిషేకం జరుగుతుంది. అందువల్ల.. కేటీఆర్ మంత్రివర్గంలో ఉండే అవకాశం లేదు. 2014 ఎన్నికల్లో కేటీఆర్ పాత్ర చాలా పరిమితం. గ్రేటర్ ఎన్నికలతో… ఆయన తెర ముందుకు రావడం ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో విజయం తర్వాత పార్టీలో క్రమంగా పట్టు పెంచుకున్నారు. ఆ తర్వాత పలు విషయాల్లో నాయకత్వం వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి పూర్తిగా తెర ముందుకు వచ్చారు. హరీష్ రావు కన్నా.. ఎక్కువగా.. పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. తనకు అప్పగించిన చోట ఘన విజయాలు సాధించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. టీఆర్ఎస్కు గొప్ప అవకాశం ఉన్న ఎన్నికలు ఇవి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా చూస్తే… టీఆర్ఎస్ పదిహేను…. వస్తాయి. పదహారు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎదురుగాలి వీచినా పదమూడు గ్యారంటీగా వస్తాయి. ఈ క్రెడిట్ మొత్తం… కేటీఆర్‌కు రావాలంటే… ఆయనకు పార్టీ బాధ్యతల్లోనే ఉండాలి. అందుకే.. ఆయనను పక్కన పెట్టడంలో ఆశ్చర్యం లేదు.
హరీష్‌ను తీసుకోకపోవడం కచ్చితంగా పక్కన పెట్టడమే..!
హరీష్‌రావును పక్కన పెట్టడమే ఆశ్చర్యం. కేసీఆర్ వారసుడు తెర మీదకు రాక ముందు వరకు.. హరీష్ రావే.. నెంబర్ టూ. ఆయన సామర్థ్యం ఏమిటో.. ప్రజలకు తెలుసు. పార్టీ నేతలకు కూడా తెలుసు. పొలిటికల్ చాలెంజ్‌ను.. తీసుకుని.. దానిలో విజయం సాధించడం.. ఆయన ప్రత్యేకత. సిద్ధిపేట నియోజకవర్గంలో ఆయన మెకానిజమే ఇది తెలియచెబుతుది. తెలంగాణ రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై.. కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన ఏ నాయకుడికి లేదు. ఆయనపై వ్యతిరేకత ఉండొచ్చు కానీ.. ఆయనకు అవగాహన లేదని చెప్పలేం. ఆ తర్వాత ఆ స్థాయిలో అవగాహన ఉన్న నేత హరీష్ రావు. కేటీఆర్ కన్నా… హరీష్ రావు పర్ఫార్మింగ్ మినిస్టర్. అందుకే.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే.. హరీష్ రావు.. స్థిమితంగా ఉండటం కష్టం. అందుకే.. కేసీఆర్‌తో పాటు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి. అక్కడ రాజకీయంగా కొత్త అవకాశాలు వెదుక్కోవాలి. లేకపోతే.. కేటీఆర్ నేతృత్వంలోని మంత్రి వర్గంలో చేరాలి. కేటీఆర్ కంటే.. హరీష్ రావు సీనియర్. అయితే.. రాజకీయాల్లో సినియార్టీకి సంబంధం లేదు. దీనికి సిద్ధపడిపోయి.. కేటీఆర్ కేబినెట్లో ఆయనకు జూనియర్‌గా పని చేయడానికి సిద్దపడిపోవాలి.
హరీష్ … కేసీఆర్‌పై తిరుగుబాటు చేసే పరిస్థితి ఉందా..?
సోషల్ మీడియాలో.. హరీష్ రావు పేరుపై రకరకాల ప్రచారం జరుగుతోంది. తను పార్టీకి క్రమశిక్షణ గల సైనికుడినని.. కేసీయార్ ఏ బాధ్యత అప్పగిస్తే.. అది చేస్తానని చెబుతున్నారు. ఏ నాయకుడైనా అదే చెబుతారు… అయితే.. హరీష్ రావు క్రమ శిక్షణ గల పార్టీ నేత. అందులో అనుమానం లేదు. కేసీఆర్ గీసిన గీత ఆయన ఎప్పుడూ దాటలేదు. రాజకీయాల్లో అవకాశాలు కోరుకుంటారు. అది తప్పు కాదు. నేరం కాదు. సోషల్ మీడియాలో ఇప్పుడు హరీష్ రావు వ్యవహారంపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అందులో ప్రధానమైనది.. హరీష్ రావు తిరుగుబాటు చేస్తారనేది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తిరుగుబాటు చేయాలంటే.. కేంద్రంలో మద్దతిచ్చే ప్రభుత్వం ఉండాలి. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ .. ప్రభుత్వం దీనికి సహకరించదు. ఎందుకంటే.. బీజేపీతో కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందుకే.. హరీష్ రావు ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుని.. పార్టీ క్రమశిక్షణకు తగ్గట్లుగా ఉంటారని.. అనుకుంటున్నారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో..అనేది చెప్పలేం. రాజకీయ పరిణితి ఉన్న నాయకుడిగా.. ఆయన వివాదాస్పద ప్రకటనలు చేస్తారని కానీ.. ప్రతిపక్షలకు సంతోషపడే… ప్రకటనలు చేస్తారనుకోవడం కష్టమే. అలాగే.. జాతీయ రాజకీయాల్లో వచ్చే మార్పులు కూడా … కీలక పాత్ర పోషిస్తారు. కాంగ్రెస్ లేదా బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తే అసలు ఇక్కడ ఏ సమస్యా ఉండకపోవచ్చు. కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఉంటారు. హరీష్, కేటీఆర్ ఇద్దరూ మంత్రులవుతారు.