ఎప్పుడైనా ఎన్నికల ప్రకటన రావొచ్చన్న వాతావరణం.. పార్టలో చేరికలు.. చేరికలతో వస్తున్న సైడ్ ఎఫెక్టులు.. ఇలాంటి కీలకమైన ఉత్కంఠ రాజకీయం మధ్య…. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిపోయారు. అక్కడ చదువుకుంటున్న కుమార్తెతో ఓ వారం రోజులు గడుపుతారు. ఆ తర్వాత తిరిగి వచ్చి మళ్లీ రాజకీయాలు చేస్తారు. ఈ సమయంలో… లండన్ నుంచి కూడా రాజకీయాలు చేస్తారు.. కానీ… హైదరాబాద్ లో ఉండి.. రాజకీయాలు చేసినంత ఎఫెక్ట్.. లండన్ నుంచి చేస్తే రాదు. నిజానికి జగన్ పాదయాత్ర ముగిసిన రెండు రోజులకే లండన్ వెళ్లబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ అప్పుడు అనూహ్యంగా వాయిదా పడింది. అప్పటి రాజకీయాలతో పోలిస్తే.. ఇప్పుడు మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది.
దీనికి కారణం.. పాదయాత్ర ముగిసిన వెంటనే లండన్ వెళ్లాలని అనుకున్నప్పటికీ… రాజకీయాల కారణంగా … ఆగిపోలేదు. కోర్టు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల అప్పట్లో పర్యటన ఆగిపోయింది. కానీ.. ఆ విషయం బయటకు రాకుండా వైసీపీ వర్గాలు జాగ్రత్తపడ్డాయి. అప్పట్నుంచి లండన్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు పర్మిషన్ కోసం ప్రయత్నించి.. ఇప్పటికి సాధించారు. పర్మిషన్ దొరికిన వెంటనే… లండన్‌కు పయనమయ్యారు. వారం రోజుల పాటు కుమార్తెతో గడిపి.. తిరిగి వస్తారు. ఈ లోపు.. కోర్టు జగన్‌కు చాలా నిబంధనలు పెట్టింది. ఫోన్, ఫ్యాక్స్ సహా… ఎక్కడెక్కడకు వెళ్లేది.. ప్రతీ సమాచారం… కోర్టుకు, సీబీఐ అధికారులకు ఇవ్వాలని ఆదేశించింది.
అక్రమాస్తుల కేసులో.. జగన్మోహన్ రెడ్డి పాస్‌పోర్ట్ కోర్ట్ అధీనంలో ఉంది. ఈ కేసుల్లో ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. బెయిల్ వచ్చిన మొదట్లో.. ఆయన ఏపీ దాటి వెళ్లకూడదని షరతు ఉండేది. ఆ తర్వాత మెల్లగా.. దేశంలో ఎక్కడికైనా వెళ్లగలిగే విధంగా పర్మిషన్ తెచ్చుకున్నారు. కానీ.. అక్కడ్నుంచి మినహాయింపులు పొందలేకపోయారు. విదేశాలకు వెళ్లాలంటే మాత్రం… కోర్టు అన్ని రకాల షరుతులు పెట్టి.. సందర్భాన్ని బట్టి చాన్స్ ఇస్తోంది. అనేక మంది ఆర్థిక నేరస్తులు..దేశం విడిచిపెట్టి పోయిన నేపధ్యంలో కోర్టులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.