టీడీపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్సీల నోటిఫికేషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల అయింది. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, మాజీ మంత్రి శమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, లక్ష్మీ శివకుమారి పదవీ కాలం మార్చి 29వ తేదితో ముగుస్తుంది. ఐదుగురు పదవీ కాలం ముగుస్తుండటంతో ఇందులో ఒకటి ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలాబలాల ఆధారంగా వైసిపి కి దక్కుతుంది. ఏలూరులో జరిగిన బీసీ సభలో వైసిపి అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పేరును ఆ పార్టీ అదినేత జగన్ ప్రకటించారు. తెలుగుదేశానిక నాలుగు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. ఇందులో యనమలకు తిరిగి ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం ఇవ్వడం ఖాయమని తేలిపోయింది.
ఏపి ఎన్జీవో అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అశోక్ బాబుకు ఎమ్మెల్సీ అభ్యర్ధిత్వం ఇస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. వంగవీటి రాధా తెలుగుదేశంలో చేరుతారని.. వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం విజయవాడలో జరుగుతోంది. అశోక్ బాబు, రాధాలో ఒకరికి మాత్రమే ఒకరికి మాత్రమే వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగతా రెండు ఎవరికి ఇస్తారనే అంశంపై టీడీపీలో భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయం కావడంతో సామాజిక సమీకరణ జాగ్రత్తగా పాటించాలని చంద్రబాబు నిర్ణయించారు. టిక్కెట్లు ఇవ్వలేని బీసీలకు… ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నారు.
గవర్నర్ కోటా కింద ఎంపికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు ఇప్పటికే రాజీనామాలు చేయడంతో నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. ఈ రెండు స్థానాలలో మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుని కుమారుడు, నెల్లూరు మేయర్ అజీజ్ లను ఎంపిక చేయనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వలసల్ని నివారించడానికి.. పోటీ చేయడానికి అవకాశం కల్పించలేని.. సీనియర్లకు.. ఎమ్మెల్సీ పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.