నాగార్జున వైసీపీలోకి చేరబోతున్నారన్న వార్త మంగళవారమంతా చక్కర్లు కొట్టింది. ఆయన గుంటూరు సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారని దానికి జగన్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పుకున్నారు. అయితే ఈ వార్తలపై నీళ్లు చల్లాడు నాగ్. రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి తనకెప్పుడూ లేదని, జగన్‌ని మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని తేల్చేశాడు.
నాగ్ ముందు నుంచీ ఇంతే. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ కి దగ్గరవుతున్నట్టు కనిపిస్తుంటాడు. అటు తెలుగు దేశంలోనూ, ఇటు వైకాపాతోనూ టచ్‌లో ఉన్నట్టు కనిపించడానికి కారణం అదే. ఏ పార్టీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడడు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు… వైఎస్ నాయకత్వ లక్షణాల్ని కొనియాడాడు. మళ్లీ నారా చంద్రబాబు నాయుడు పదవిలోకి రాగానే… చంద్రబాబు నాయుడు దూకుడుని మెచ్చుకున్నాడు. తెలంగాణ విషయంలోనూ అదే జరిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అప్పుడు కేటీఆర్నీ, కేసీఆర్నీ ఆకాశాన్ని ఎత్తేయడం ప్రారంభించాడు. ఎన్ కన్వెన్షన్ కేసు కోర్టులో ఉన్నప్పుడు.. ఆ స్నేహం చాలా మట్టుకు ఉపయోగపడిందని, ఎన్ కన్వెన్షన్‌లో కొంత భాగం ప్రభుత్వ పరం కాకుండా కాపాడిందని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి.
త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి తేదాపా – వైకాపా నువ్వా నేనా అన్నట్టున్నాయి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావొచ్చు. అందుకే ఎందుకైనా మంచిదని… జగన్‌ని ప్రసన్నం చేసుకున్నాడేమో అనిపిస్తోంది. వైకాపాలో నాగ్‌కి నిజంగానే చేరాలని వుంటే, ఈ పాటికే ఆ పనులన్నీ అయిపోయి ఉండేవి. నాగ్ ఉద్దేశం ఓ పార్టీలో చేరి, టికెట్ అందుకుని గెలవడం కాదు. రాబోయే రోజుల్లో తన స్థలాలకు, ఆస్తులకు, మరీ ముఖ్యంగా అన్నపూర్ణ స్డూడియోకి ఎలాంటి ఆటంకం రాకుండా ఉండడం. అందుకే ఏ పార్టీకి వ్యతిరేకి కాదన్న ముద్ర కోసం ఇలా పరితపిస్తుంటాడు. ఇదంతా చూస్తే… నాగ్ తన స్వప్రయోజనాల కోసమే, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నాడన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.