హైదరాబాద్ లో ఆస్తులున్న నేతలను.. బెదిరించి.. భయపెట్టి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పై మరో కుట్ర జరుగుతోందని..ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో ఆస్తులు ఉన్నవారిని మనకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నారని.. ఎమ్మెల్యేలు, ఎంపీలను బెదిరిస్తున్నారని చంద్రబాబు చెబుతున్నారు. చెప్పినట్లు చేయాలని కమాండ్ చేస్తున్నారని …బెదిరించి భయపెట్టి మన మీద పురిగొల్పుతున్నారని అంటున్నారు. ఇది దారుణమైన కుట్ర ..దీని వల్ల మనం చాలా నష్టపోతామని… చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వాళ్లు ఇక్కడ గెలిస్తే మనకు నీళ్లు కూడా రావన్నారు.
వైసీపీలో చేరికల వెనుక టీఆర్ఎస్ నేతల హస్తం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ సహకారం కోసమే… జగన్ హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తున్నారని… జగన్ ఏపీకి వస్తే..ఆ సహకారం ఉండదన్న కారణంగానే.. అక్కడే ఉంటున్నారని.. టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న వారిని నయానో..భయానో… వైసీపీలో చేర్పించేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరుతున్న నేతలంతా.. ఇలాంటి వారే కావడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. జనవరి ఎనిమిదో తేదీన పాదయాత్ర ముగించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్ప ట్నుంచి హైదరాబాద్ కే పరిమితమయ్యారు. పాదయాత్ర జరగని నియోజకవర్గాలను.. బస్సు యాత్ర ద్వారా కవర్ చేస్తానని.. జగన్ .. తన పార్టీ నేతలకు చెప్పారు. షెడ్యూల్ కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా బస్సు యాత్రను రద్దు చేసుకున్నారు.
పార్టీలో చేరాలనుకుంటున్న వారిని హైదరాబాద్ పిలించుకుని.. కండువాలు కప్పుతున్నారు. తాడేపల్లిలో జగన్ కట్టుకున్న ఇల్లు కూడా .. రెడీ అయింది. పధ్నాలుగో తేదీన గృహప్రవేశం చేయాలనుకున్నారు. కానీ అనూహ్యంగా వాయిదా వేసుకున్నారు. విజయవాడలో.. వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఎప్పుడో ప్రారంభించారు. కానీ.. అక్కడ్నుంచి కార్యకలాపాలు నిర్వహించడానికి జగన్ సిద్ధంగా లేరు.ఈ పరిణామాలకు ఇప్పుడు చంద్రబాబు ఆరోపణలు తోడయ్యాయి. అయితే.. చంద్రబాబు ఆరోపణలు.. వలసల్ని నిరోధించడానికా లేక.. నిజంగానే… హైదరాబాద్ లో ఆస్తులున్న వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారా..అన్న అంశం… బయటకు రావడం కష్టమే.