టీడీపీని వదిలి ఆమంచి కృష్ణమోహన్ వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీలో ఆయనకి ఈసారి సీటు దక్కడం కాస్త అనుమానమే అనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఆమంచి పార్టీ మారిపోయారు. వాస్తవానికి, ఆయన టీడీపీ నుంచి సీటు దక్కించుకున్నా… పార్టీలోని ఒక వర్గం ఆయన్ని ఓడిస్తుందనే ప్రచారమూ ఉంది. దీంతో వైకాపా నుంచి బరిలోకి దిగితే బాగుంటుందని ఆయన భావించారు. కానీ, అక్కడ కూడా ఆమంచికి చుక్కెదురయ్యే పరిస్థితే కనిపిస్తోంది. ఆమంచి వైకాపాలో చేరికపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. ఆమంచిని పార్టీలో చేర్చుకోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోందనీ, ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలంటూ చీరాల వైకాపా ఇన్ ఛార్జ్ ఎడం బాలాజీ అన్నారు.
ఆమంచిని పార్టీలో చేర్చుకునేముందు స్థానిక వైకాపా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోలేదనీ, కనీసం తనకైనా ఒక మాటగా జగన్ చెప్పలేదంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. పార్టీకి సేవ చేయడం కోసం విదేశాల్లో ఉన్న వ్యాపారాలను తాను వదులుకుని వచ్చాననీ, ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకుని ఉన్నందుకు జగన్ తనకు సరైన బహుమానమే ఇచ్చారంటూ బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లుగా ఆమంచి ఆకృత్యాలపై పోరాటం సాగించానన్నారు. అంతేకాదు, అప్పట్లో ఆమంచిని జగన్ ఎదుర్కొనలేకపోయారనీ, అందుకే తనను పార్టీలోకి పిలిచారనే విషయాన్ని జగన్ ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు.
ఆమంచి చేరిక విషయంలో సమగ్రమైన చర్చ జరగాలనీ, తన ప్రశ్నలకు జగన్ వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తాను పంపుతున్న లేఖకు జగన్ స్పందించకపోతే పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనకాడనన్నారు బాలాజీ. అంతేకాదు, తనను కాదని ఆమంచికి టిక్కెట్ ఇచ్చినా… ఆయన్ని కచ్చితంగా ఓడించి తీరతానని కూడా ఆయన అన్నారు. ఇదీ ఆమంచి చేరిక ఎఫెక్ట్. టీడీపీ మీద పోరాటం చేస్తానంటూ వైకాపాలో చేరిన వెంటనే ఆమంచి సవాళ్లు చేశారు. కానీ, ఇప్పుడు సొంత పార్టీ వైకాపా నేతల నుంచే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమౌతోంది. పార్టీ మారడం ద్వారా వ్యతిరేకుల సంఖ్యను రెండింతలు చేసుకున్నట్టుగా ఉంది! ఇక్కడో మరో అంశం గమనించాలి. అదేంటంటే…. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నవారి అభిప్రాయాలను జగన్ పెద్దగా పరిగణనలోకి తీసుకోరనేది! ఎప్పట్నుంచో పార్టీని నమ్ముకున్నవారికే ప్రాధాన్యత లేకపోతే, కొత్తగా వచ్చిన వలస పక్షులకు గుర్తింపు ఎక్కడ ఉంటుంది..?