రాష్ట్ర విభజన జరిగి ఇన్నాళ్లైనా ఇంకా హైదరాబాద్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. గత ఎన్నికల తరువాత… వెంటనే ఉభయ గోదావరి జిల్లాల్లో నివాసం ఏర్పాటు చేసేసుకుంటారు అన్నారు! ఆ తరువాత… ఆంధ్రాకు మకాం మార్చే ఆలోచనే చెయ్యలేదు. రాష్ట్ర విభజన తరువాత పార్టీల కార్యాలయాలన్నీ ఒక్కోటిగా ఆంధ్రాకి చేరుకున్నా… అందరికంటే ఆలస్యంగా ఏపీలో పార్టీ ఆఫీస్ పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారిక నివాసాన్ని ఆంధ్రాకి మార్చేసుకున్నా… ప్రతిపక్ష నేత మాత్రం లోటస్ పాండ్ నుంచే రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఏపీకి రెండోసారి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా… పార్టీల్లో చేరికలకు ఇంకా హైదరాబాద్ ఆఫీసే కేంద్రంగా వ్యవహరిస్తోంది.
నిజానికి, తాడేపల్లిలో జగన్ నివాసం, కార్యాలయ భవన నిర్మాణం ఈ మధ్యనే పూర్తయింది. పాదయాత్ర పూర్తయిన వెంటనే ఆంధ్రాకి నివాసం మార్చేస్తారు అనుకున్నారు. ఫిబ్రవరి 14న గృహ ప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నారు. అయితే, సోదరి షర్మిల, బావ అనిల్ కుమార్ లకు జ్వరంగా ఉందనీ, అందుకే గృహ ప్రవేశం వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పారు. సరిగ్గా అదే రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా విశాఖ పర్యటన పెట్టుకున్నారు. ఆ పర్యటనలోనే జగన్ తో భేటీ అవుతారని కూడా కథనాలొచ్చాయి. అయితే, కేటీఆర్, జగన్ ల భేటీ జరిగిన తరువాత… వైకాపాకి ఇది రాజకీయంగా కలిసివచ్చే అంశం కాదనే విశ్లేషణలు చాలా వచ్చాయి. దీంతో, తెర వెనక మద్దతుకు తెరాస పరిమితమౌతున్న పరిస్థితి కనిపిస్తోంది. కారణమేదైనా గృహప్రవేశ కార్యక్రమం ఈనెల 27కి వాయిదా పడింది. అంటే, ఎన్నికలకు కొన్ని నెలలు ముందుగా మాత్రమే ఏపీకి నివాసం మారుస్తున్నారు జగన్.
నివాసం మార్చకపోవడం వల్ల రాజకీయంగా జరిగిన నష్టమేముందని కొంతమంది అభిప్రాయపడొచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో… తెరాసతో జతకట్టడం, తెరాస ప్రోద్బలంతోనే టీడీపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కోవడం, వైకాపా కీలక రాజకీయ పరిణామాలు కూడా హైదరాబాద్ కేంద్రంగా జరగడంతో… స్థానిక కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో ఊపు లభించలేదన్నది వాస్తవం. తమ పార్టీ అధినాయకత్వం సొంత రాష్ట్రంలో ఉందనడానికీ, పక్కరాష్ట్రంలో ఉందనడానికీ ఉన్న తేడా కార్యకర్తల కార్యదక్షతలో తేడాకి కారణమౌతుంది. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో నివాసం మార్చుకోవడం ద్వారా… ఎన్నికల అవసరానికి మాత్రమే అధినాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాలు కార్యకర్తల్లోకి వెళ్లకమానవు.