వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు… ఇటీవలి కాలంలో.. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే అంత కోపం రావడం లేదు కానీ… నరేంద్రమోడీని… ఎవరైనా విమర్శిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వెంటనే రంగంలోకి దిగిపోయి చెడామడా విమర్శలు కురిపించేస్తున్నారు. ఇందులో ఎలాంటి రిజర్వేషన్లు పెట్టుకోవడం లేదు. మొన్నామధ్య.. మోడీ గుంటూరు వచ్చినప్పుడు.. ఆయనకు సరైన స్వాగత సత్కారాలు ఇవ్వలేదని.. ప్రోటాకాల్ పాటించలేదని… వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి పార్టీ తరపున ప్రెస్‌మీట్ పెట్టి బాధపడిపోయారు. నిజానికి బీజేపీ నేతలు కూడా.. ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. ఆనం అలా అన్న తర్వాతే బీజేపీ నేత పురందేశ్వరి మీడియా ముందుకు వచ్చి.. మోడీని గౌరవించలేదని… బాధపడ్డారు. ఇప్పుడు వైసీపీ తరపున..మోడీ కోసం బాధపడే బాధ్యతను… నగరి ఎమ్మెల్యే రోజా తీసుకున్నారు.
పుల్వామా ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా చెబుతూ.. చంద్రబాబు.. మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. చంద్రబాబు దీనికో లాజిక్ చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు.. కశ్మీర్లో జరిగిన దాడికి సంబంధించి.. అప్పట్లో.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ… కేంద్రంపై విరుచుకుపడ్డారు. మన్మోహన్ చేతకాని తనం అని రాజీనామా చేయాలని విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అయితే.. మన్మోహన్ సింగ్‌కు గాజులు పంపి.. తన దేశభక్తిని చాటుకున్నారు. మోడీ డిమాండ్‌ను గుర్తు చేసిన చంద్రబాబు… ఇప్పుడు అదే డిమాండ్‌ను ఆయన ఎందుకు పాటించరని ప్రశ్నించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదు.. చంద్రబాబు మాట్లాడిన వేరే మాటలపై… తమ రాజకీయం చేసుకున్నారు కానీ… మోడీ గౌరవాన్ని కాపాడి.. ఎదురుదాడి చేసే అవకాశం మాత్రం రోజాకు ఇచ్చినట్లుగా ఉన్నారు. ఆమె తిరమలలో శ్రీవారి దర్శనం చేసుకుని బయటుక వచ్చి.. చంద్రబాబు డిమాండ్‌పై చెలరేగిపోయారు.
మోదీ ని చంద్రబాబు రాజీనామా చేయాలనడం దిగజారుడుతనానికి నిదర్శనమని తేల్చేసారు. పుష్కరాల్లో 30 మంది చనిపోతే చంద్రబాబు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఎవరితోనూ కుట్రలు చేయడం లేదని… ఒక వేళ జగన్ మోదీ, కేసీఆర్‌తో కలిసి కుట్ర చేస్తే టీడీపీలో ఒక్కరు కూడా మిగలరని జోస్యం చెప్పారు. మొత్తానికి వైసీపీ నేతలు… మోడీపై తమ.. అభిమానాన్ని దాచుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు.