ఎన్నికల ప్రకటన రాక ముందే టీడీపీ అధినేత చంద్రబాబు… అధికారిక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. ఉన్నతాధికారులకు కూడా.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే సమయం కేటాయిస్తున్నాయి. కృష్ణా జిల్లా అసెంబ్లీ నియోజవకర్గాల టిక్కెట్లను.. ఆయన ఖరారు చేశారు. గుడివాడ, పామర్రు నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ ఉంచారు. పెనమలూరు, గన్నవరం, అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాలలో సిట్టింగ్ లయిన బోడే ప్రసాద్, వల్లభనేని వంశీ, మండలి బుద్ద ప్రసాద్, కొల్లు రవీంద్ర పేర్లు ఖరారయ్యాయి. విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో తిరువూరు మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేశారు.
విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాలకు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖతూన్, తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య పేర్లు ఖరారయ్యాయి. నందిగామ, జగ్గయ్యపేటలో పార్టీ నేతలతో ఉన్న విభేధాలను సర్ధుబాటు చేసుకోవాలని.. అభ్యర్థులకు సీెం సూచించారు. తిరువూరులో నల్లగట్ల స్వామి దాసు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు మరోసారి చాన్సిచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కోవూరులో పార్టీ క్యాడర్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి జవహర్ స్వస్థలం తిరువూరు కావడంతో..అక్కడ ఆయనకు టిక్కెట్ ఇస్తారని చెబుతున్నారు.
గుడివాడ నియోజకవర్గం నుంచి రావి వెంకటేశ్వరరావు కు ఈ సారి చాన్స్ లేనట్లే. అక్కడ టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేరు బలంగా వినిపిస్తోంది. పామర్రులో ఉప్పులేటి కల్పన వైసీపీ నుంచి వచ్చినప్పటికీ.. ఆమె భర్త ఐ.ఆర్.ఎస్ అధికారి దేవి ప్రసాద్ ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆయన బాపట్ల పార్లమెంట్ టిక్కెట్ అడుగుతున్నారు. ఇద్దరిలో ఒకరికే టిక్కెట్ ఇస్తారు కాబట్టి …ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టారు. అభ్యర్థులను పిలిచి.. నేరుగా టిక్కెట్ ఖరారైన విషయాన్ని చెప్పి… నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించడానికి ఏం చేయాలో చెబుతూ.. కొన్ని సర్వే నివేదికల్ని కూడా చంద్రబాబు… అభ్యర్థుల చేతిలో పెడుతున్నారు.