మహానాయకుడు తరవాత క్రిష్ చేయబోయే సినిమా ఏమిటన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. గత కొన్ని నెలలుగా తీరక లేకుండా గడుపుతున్నాడు క్రిష్. అటు మణికర్ణిక, ఇటు ఎన్టీఆర్ రెండు భాగాలుతో బాగా బిజీ బిజీగా ఉన్నాడు. మహానాయకుడు రిలీజ్ అయిన వెంటనే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఫిక్సయ్యాడు. అయితే ఆ తదుపరి సినిమాలు ఎవరితో చేయాలి? అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.
బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో క్రిష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఎలాంటి కథతో ఈ సినిమా తెరకెక్కాలి? అనే విషయంలో దర్శక నిర్మాతల మధ్య ఓ అవగాహన కుదిరింది. అయితే అంతకంటే ముందు క్రిష్ తన సొంత సంస్థ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తరవాతే.. ఆర్కా మీడియా సినిమా ఉండబోతోంది. ఈసారి పెద్ద హీరోతో చేయాలా? లేదంటే కొత్తవాళ్లతో ముందుకెళ్లాలా? అనే విషయంలో క్రిష్ ఇంకా ఓ నిర్దారణకు రాలేదు. తన దగ్గర రెండు మూడు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. కథని బట్టి కథానాయకుడ్ని ఎంచుకోవడం క్రిష్ శైలి. ఈసారీ అదే జరగబోతోంది. త్వరలో క్రిష్సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.