తెలంగాణ శాసన మండలి చైర్మన్ కొద్దిరోజుల కిందట ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేశారు. రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డి.. ఇలా అనర్హతా వేటుకు గురయ్యారు. అయితే.. వీరిలో ఇద్దరు రాములు నాయక్, యాదవరెడ్డి… హైకోర్టును ఆశ్రయించారు. తమపై అన్యాయంగా.. చట్ట విరుద్దంగా… అనర్హతా వేటు వేశారని వీరి ఆరోపణ. దీనిపై హైకోర్టులో జరిగిన విచారణలో… ప్రభుత్వం సరైన కారణాలు చెప్పలేక నీళ్లు నమిలింది. రాములు నాయక్..గవర్నర్ కోటాలో.. ఎమ్మెల్సీ అయ్యారు. ఆయనను నామినేట్ చేసేటప్పుడు గవర్నర్… టీఆర్ఎస్ నేతగా… చెప్పలేదు. సామాజిక సేవ కేటగిరీ కింద రాములు నాయక్‌ను ఎమ్మెల్సీ చేశారు. అంటే ఆయనకు.. ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. కానీ… మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాత్రం ఆ చట్టం కింద ఆయనపై అనర్హతా వేటు వేసేశారు. ఇదే ఇప్పుడు ఆయనకు చిక్కలు తెచ్చి పెట్టే అవకాశం కనిపిస్తోంది.
యాదవరెడ్డి… టీఆర్ఎస్ తరపునే ఎన్నికయినప్పటికీ… తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వాదిస్తున్నారు. యాదవరెడ్డి ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్‌లో చేరినట్లు మీడియాలోవచ్చిన కథనాల ఆధారంగా మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. మీడియా వార్తలను ఆధారాలుగా పరిగణనలోకి తీసుకోవద్దని కోర్టులు చెబుతున్నాయని ఆయన వాదిస్తున్నారు. యాదవరెడ్డి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని కోర్టుకు చెప్పారు. హైకోర్టు.. వీరి నామినేషన్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం తరపు లాయర్‌ను ఆదేశించింది. వాటిని ఇస్తారా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిపించమంటారా..? అని కోర్టు ప్రశ్నించడంతో.. సమర్పిస్తామని.. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. విచారణ తేలే వరకూ.. అనర్హతా వేటు వేసిన మండలి స్థానాల ఎంపికకు నోటిఫికేషన్ ఇవ్వబోమని.. ఈసీ కూడా.. హైకోర్టుకు సమాచారం ఇచ్చింది.
గత శాసనసభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లపై కూడా అప్పటి స్పీకర్ … సహజ న్యాయసూత్రాలు పాటించకుండా.. రాత్రికి రాత్రే అనర్హతా వేటు వేశారు. కోర్టు సాక్ష్యాలు అడిగితే సమర్పించలేకపోయారు. దాంతో.. వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. కానీ ఆ ఆదేశాలు ఎవరూ పాటించలేదు. ఇప్పుడు కోర్టు ఆ అంశంపై సీరియస్ అయింది. మధుసూదనాచారిని కోర్టుకు రావాలని ఆదేశించింది. రాకపోతే.. అరెస్ట్‌కు ఆదేశిస్తామని కూడా హెచ్చరించింది. ఇప్పుడు .. నిబంధనలకు విరుద్ధంగా… మండలి సభ్యులపై… అనర్హతా వేటు వేసినట్లు కోర్టు ఆక్షేపణకు గురైతే.. స్వామిగౌడ్కూ తిప్పలు తప్పవేమో..?