రాఫెల్ డీల్ వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పటి వరకూ తమకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని కాలర్ ఎగరేస్తున్న బీజేపీ నేతలకు ఇది ఇబ్బందికర పరిణామమే. రాఫెల్ డీల్‌పై తీర్పును రివ్యూ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. గతంలో ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలంటూ దాఖలైన 4 పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. గత డిసెంబర్లో ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో.. కేంద్ర ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని పిటిషనర్లు ఆరోపించారు. అప్పట్లో విచారణలో సీల్డ్ కవర్లో డీల్ కు సంబంధించిన వివరాలను కేంద్రం అంద చేసింది. అందులో అనేక అవాస్తవాలున్నాయి.
ఆ వివరాలు బయటకు రావడంతో.. పిటిషనర్లు కేంద్రం తీరుపై ఆరోపణలు చేస్తూ రివ్యూ పిటిషన్ వేసారు. కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదిక ఆధారంగా డీల్‌లో అవకతవకలు గుర్తించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టును తప్పుదోవ పట్టించేలా వివరాలు ఉన్నాయని.. వారిపై చర్యలకు ఆదేశించాలని కోరిన పిటిషనర్లు కోరారు. సమీక్ష కోరుతూ దాఖలైన 4 పిటిషన్లను కలిపి విచారణ చేపట్టేందుకు సీజేఐ అంగీకరించారు. సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన వివరాల ప్రకారం.. కాగ్ నివేదికలో.. ధరల వివరాలు అన్నీ చెప్పామని… అన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని.. వివరించారు. కానీ అలాంటివేమీ అప్పటి వరకూ చేయలేదు. అలాగే.. డీల్ విషయంలో.. ప్రధానమంత్రి కార్యాలయం ఎలాంటి జోక్యం చేసుకోలేదని తెలిపింది.
కానీ… నేరుగా.. డీల్ విషయంలో పీఎంవోనే చర్చలు జరిపిందని వెల్లడయింది. ఈ రెండింటితో పాటు… దేశప్రయోజనాలకు భంగం కలిగే అనే క్లాజుల్ని ఒప్పందం నుంచి తొలగించినట్లుగా.. కాగ్ నివేదికలో బయటకు వచ్చింది. ధర విషయంలోనూ… తేడాలున్నాయని.. కచ్చితంగా అవినీతి జరిగిందని… పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై.. ఆసక్తి ఏర్పడింది. ఒక వేళ విచారణకు ఆదేశిస్తే మాత్రం పెను సంచలనం నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది.