భారతీయ జనతా పార్టీకి ఉన్న దేశభక్తిని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్ కి లేదన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా. రాజమండ్రిలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ… భాజపా రక్తంలో దేశభక్తి ఉందని ప్రజలకు తెలుసనీ, దేశం కోసం ప్రధాని మోడీ అహర్నిశలూ పనిచేస్తున్నారని అన్నారు. తీవ్రవాదుల దాడుల్ని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసన్నారు. మన జవాన్లు వీర మరణం పొందితే… దాన్ని కూడా రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ చేసి, తీవ్రవాద స్థావరాలను అణచివేస్తే.. అప్పుడు కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారన్నారు. సైన్యాధికారిని కించపరచే విధంగా రాహుల్ విమర్శించారన్నారు.
తాను పర్యటనకి వస్తున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయనకి మనదేశ ప్రధాని మీద కంటే, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద నమ్మకం ఉన్నట్టు అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మనదేశంలో కొంతమంది ఎంత నీచంగా రాజకీయాలు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి అన్నారు అమిత్ షా! ఏపీ సీఎం రాష్ట్రాన్ని వదిలేసి బెంగాల్ లో, మహారాష్ట్రలో, ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రాకి అన్యాయం చేసిన కాంగ్రెస్ తో కలిసి తెలంగాణలో పోటీ చేస్తారు, రాష్ట్రం అభివృద్ధి చెయ్యలేదంటూ మాపై విమర్శలు చేస్తారన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాల్లోని 90 శాతం పూర్తి చేశామన్నారు. ఆంధ్రాని అభివృద్ధి చేయాలంటే అది చంద్రబాబు, జగన్ ల వల్ల సాధ్యం కాదనీ, కేవలం భాజపా వల్ల మాత్రమే జరుగుతుందన్నారు.
ఆంధ్రాకి ఎంతో చేశామంటూ మళ్లీ మళ్లీ అదే పాట పాడుతున్నారు అమిత్ షా. అంతవరకూ ఓకేగానీ… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశించి… పాక్ ప్రధానిపై ఆయనకి నమ్మకం ఉందా అని వ్యాఖ్యానించడం దారుణం. నీచ రాజకీయం అని దీన్నే అంటారు! దేశంలోని పరిస్థితులను వారి రాజకీయ మైలేజీకి అనుగుణంగా మార్చుకోవడం భాజపాకి మాత్రమే అలవాటైన పని. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఆంధ్రాకి వచ్చి… తీవ్రవాద దాడుల నేపథ్యం నుంచి ఏదో ఒక కనెక్షన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రిపై ఇలాంటి విమర్శలు చేయడం… ఏ తరహా రాజకీయం?