ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని గట్ిటగా ప్రయత్నించిన వైఎస్ సమకాలికుడు డీఎల్ రవీంద్రారెడ్డికి ఏ పార్టీలోనూ చోటు లభించలేదు. అటు వైసీపీ.. ఇటు టీడీపీ కూడా.. ఆయనకు మైదుకూరు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించాయి. టీడీపీ తరపున మైదుకూరు టిక్కెట్ కోసం.. ఆయన చాలా తీవ్రంగా ప్రయత్నించారు. రెండు సార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అయినప్పటికీ.. అక్కడ… టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్… చాలా తీవ్రంగా టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కడప జిల్లాలో ఓ బీసీ అభ్యర్థికి కచ్చితంగా టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం.. మరో బీసీ అభ్యర్థి… ఇతర నియోజకవర్గాల్లో బలంగా లేకపోవడంతో… పుట్టాకే .. చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు. ప్రస్తుతం పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. తెలంగాణ నుంచి టీడీపీ ఓటమికి టీఆర్ఎస్ తరపున ప్రధాన అస్త్రంగా ఉన్న తలసానికి వియ్యంకుడు కూడా.
డీఎల్ రవీంద్రారెడ్డి.. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గంతో.. వైసీపీకే నేరుగా మద్దతు ప్రకటించారు. ఓట్లు వేయించారు. అయినా.. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీకి దగ్గరగా.. దూరంగా ఉంటూ వస్తున్నారు. కొన్నాళ్ల క్రితం… టిక్కెట్ ఖరారు కోసం.. తన అనుచరుల్ని… డీఎల్ జగన్ వద్దకు పంపారు. మైదుకూరులో.. వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉండటంతో.. జగన్మోహన్ రెడ్డి.. డీఎల్‌ను తీసుకోవడానికి విముఖత ప్రదర్శించారు. పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి పంపించారు. కానీ డీఎల్ మాత్రం ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడాలని నిర్ణయించుకున్నారు. అందుకే టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు.
మైదుకూరు నియోజకవర్గానికి సుదీర్ఘ కాలంగా.. ఎమ్మెల్యేగా ఉండి.. ఆ నియోజకవర్గంలో పట్టున్న నేతగా ఉన్న… డీఎల్.. మాజీ మంత్రిగా పని చేశారు. మొదట్లో వైఎస్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఆ తర్వాత రాజకీయ ప్రత్యర్థిగా మారారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా చేసి.. ఆయనతో కూడా విబేధాలు రావడంతో.. మధ్యలోనే పదవిని వదిలి పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన దాదాపుగా.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరమయ్యారు. ఇప్పుడు.. ఏ పార్టీలోనూ.. అవకాశం దక్కని పరిస్థితి ఏర్పడింది. అయితే గెలుపోటముల్ని నిర్దేశించగలిగే అనుచరగణం ఆయనకు ఉంది. ఓ వైపు తలసాని.. టీడీపీ నేతలను వైసీపీలో చేర్పించేందుకు ప్రయత్నిస్తూంటే… మరో వైపు ఆయన వియ్యంకులకు చంద్రబాబు.. టిక్కెట్లు ఇచ్చి ప్రొత్సహించడం.. పార్టీ క్యాడర్లో అసంతృప్తికి కారణం అవుతోంది.