తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లు దాటుతుందన్న అంచనాలను.. కేసీఆర్.. తలకిందులు చేశారు. కేవలం రూ. 1, 82, 017 కోట్లతోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్ పద్దు రూ.1,74,453 కోట్లు. అంటే.. గత ఏడాదితో పోలిస్తే.. బడ్జెట్ కేవలం రూ. ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెరిగింది. కానీ.. సంక్షేమ శాఖలకు కేటాయింపులు మాత్రం భారీగా పెంచారు. ఎన్నికల్లో హామీల అమలు చేయడానికి నిధులు కేటాయించారు. రైతు బంధు పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయించారు. నిజానికి ఎకరానికి రూ. 5వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. దాని ప్రకారం.. నిధులు పెంచాల్సి ఉంది. అయితే.. కేంద్ర కిసాన్ సమ్మాన్ పథకాన్ని కూడా.. దీనిలో కలిపిస్తే.. ఆ మిగులు నిధులు కవర్ చేసుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆసరా పెన్షన్లకు రూ. 12.067 కోట్లు కేటాయించారు. వయసు పరిమితి తగ్గించినందుకున.. రూ. పదిహేను వేల కోట్ల వరకూ అవసరం అవుతాయని అంచనాలు వేశారు. అయినా పన్నెండు వేల కోట్లకే పరిమితం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీ రుణమాఫీ. రూ. లక్ష రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రకారం.. రూ. ఆరు వేల కోట్లు.. ఈ రుణమాఫీకి కేటాయించారు. నిరుద్యోగ భృతి రూ. 1.810 కోట్లు కేటాయించారు. ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 16,581 కోట్లు, ఎస్టీలకు రూ. 9827 కోట్లు., మైనార్టీలకు రూ. 2004 కోట్లు, ఈఎన్టీ, దంత పరీక్షలకు రూ. 5,536 కోట్లు , రూపాయి కిలో బియ్యానికి రూ. 2744 కోట్లు, మిషన్ కాకతీయకు రూ. 22,500 కోట్లు కేటాయించారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్లకు రూ. 1,450 కోట్లు, రైతు బీమా రూ. 650కోట్లు వెచ్చిస్తున్నారు. పంట కాలనీల కోసం కొత్తగా రూ. ఇరవై వేల కోట్లకుపైగానే కేటాయించారు. మొత్తంగా బడ్జెట్లో… బడ్జెట్లో అభివృద్ధి పనుల కోసం రూ. 1,07, 302 కోట్లు కాగా.. నిర్వహణ పద్దురూ. 74.115 కోట్లుగా నిర్ధారించారు. హైదరాబాద్ చుట్టూ మరో రీజినల్ రింగ్ రోడ్డుకు.. నిధులు కేటాయించారు.
కేసీఆర్.. గత ఐదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని… బడ్దెట్ పద్దును పెట్టే సమయంలో వివరించారు. రైతు బంధు పథకాన్ని దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందని గర్వంగా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించిందన్నారు. అలాగే.. ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించినట్లుగా… ఈ సారి ఈఎన్టీ వైద్య సేవలు ప్రజలకు అందించబోయే.. తొలి రాష్ట్రం తెలంగాణనేనని… ఉత్సాహంగా ప్రకటించారు. దాదాపుగా ప్రతి సందర్భంలోనూ… సమైక్య రాష్ట్రంలోని పరిస్థితిని పోల్చి.. కేసీఆర్.. తాజా అభివృద్ధిని వివరించారు. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టినందున.. ఇప్పుడు.. తాము కూడా.. ఓటాన్ అకౌంటే ప్రవేశ పెట్టామని… అందుకే.. పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశ పెట్టిన తర్వాత .. పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెడుతుందని ప్రకటించారు. అప్పుడే.. కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్పష్టత వస్తుందన్నారు.