తెలుగుదేశం పార్టీతో పొత్తుల చర్చలు జరుపుతున్నానంటూ.. వైఎస్ జగన్ కు చెందిన పత్రిక సాక్షి కథనం రాయడంపై పవన్ కల్యాణ్ విభిన్నంగా స్పందించారు. తనతో అందరూ స్నేహం చేయాలనుకుంటున్నారని.. తనను మద్దతుదారుగా ఉండిపోవాలనుకుంటున్నారని.. కానీ తనో సైనికుడినని చెప్పుకొచ్చారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ.. తెలుగుదేశం పార్టీతో కలిపేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందని… ఆ మేరకు వారి మీడియాలో ప్రచారం చేస్తూంటారని విమర్శించారు. ఇక టీడీపీ నేతలు… తను కేసీఆర్ ఏజెంట్ నని.. వైసీపీ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూంటారనే ఆరోపణలు చేస్తూంటారన్నారు. ఇలా అందరూ .. తనపై గురి పెట్టి ఆరోపణలు చేస్తున్నారని.. దీని వల్ల తానొక్కడ్నే.. సిన్సియర్ గా ప్రజల కోసం పని చేస్తున్నట్లు ప్రజలకు అర్థమవుతోందన్నారు.
ప్రజల కోసం పని చేసే వారినే.. అందరూ టార్గెట్ చేస్తారన్నారు. తన పార్టీపై గురి పెట్టి.. కొంత మంది.. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి అనేక రకాలైన విమర్శలు చేస్తూంటారని.. ఆరోపణలు చేస్తూంటారని.. ఓ రాజకీయ వేత్త చెప్పారన్నారు. తిప్పికొట్టడానికి పత్రిక, చానల్ ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. తనకు.. పార్టీ కార్యకర్తలే పత్రిక, చానల్ అని .. వారే.. అసలు నిజాలు చెబుతారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తనకు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షిరాం స్ఫూర్తి అన్నారు. టీడీపీతో కానీ.. వైసీపీతో కానీ పొత్తులు పెట్టుకోవడం లేదని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీని ఓడించి… జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని పవన్ కల్యాణ్.. ట్విట్టర్ వేదికగా జన సైనికులకు పిలుపునిచ్చారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం… క్షేత్ర స్థాయి పర్యటనలు నిలిపివేసి.. పార్టీ సంస్ధాత కార్యక్రమాలను చక్కబెట్టుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. కొత్త పద్దతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే.. తాను ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం లేదని…కేవలం కమ్యూనిస్టు పార్టీలతోనే పొత్తులు పెట్టుకుంటానని ప్రకటించారు. ఈ లోపే.. సాక్షి మీడియా పవన్ కల్యాణ్ ఇరవై ఐదు అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాల కోసం చర్చలు జరుపుతున్నారంటూ… కథనం ప్రచురించడంతో కలకలం రేగింది.