నందమూరి బాలకృష్ణ – కోడి రామకృష్ణలది సూపర్ హిట్ కాంబినేషన్. అప్పట్లో బాల గోపాల కృష్ణ త్రయం అని బాలకృష్ణ, కోడి రామకృష్ణ, ఎస్.గోపాల రెడ్డిలను పిలిచేవారు. ఎందుకంటే ఈ ముగ్గురు కలసి ఎప్పుడు సినిమా చేసినా అది సూపర్ హిట్టే. ‘మంగమ్మగారి మనవడు’ సినిమా బాలకృష్ణకు తొలి సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా హైదరాబాద్‌లో 545 రోజులు ఆడింది. ‘ముద్దుల మావయ్య’తో బాలకృష్ణ స్టార్‌గా మారిపోయాడు. అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. వీరిద్దరి కాంబినేషన్లో ‘విక్రమ సింహా’ అనే సినిమా మొదలైంది. 50 శాతం షూటింగ్ కూడా జరిగింది. కానీ ఎందుకో మధ్యలో ఆగిపోయింది. దర్శక నిర్మాతల మధ్య విభేదాలు రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని అప్పట్లో టాక్. ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో చెప్పడానికి కోడి రామకృష్ణ కూడా ఇష్టపడేవారు కాదు. ఎప్పుడు అడిగినా”ఈ సినిమా పూర్తి చేయాలని ఉంది. త్వరలోనే షూటింగ్ మళ్లీ మొదలెడతాం” అని చెప్పేవారు. సత్యసాయిబాబాకి వీర భక్తులు కోడి రామకృష్ణ. ఆయన జీవితంపై ఓ సినిమా తీయాలని సంకల్పించారు. ‘భారత్ బంద్’ టైపులో ‘ప్రపంచ బంద్’ అనే ఓ కథ రాసుకున్నారు కోడి. దాన్ని సినిమాగా తీయాలన్నది ఆయన ఆశ. కానీ ఇవేం తీరకుండానే తెలుగు చిత్రసీమని వదిలి వెళ్లిపోయారు.