కశ్మీర్‌లోని పుల్వామా దాడి జరిగిన తర్వాత దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒకే మాటమీద ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం కాదని.. పాకిస్థాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. తమ మద్దతు ఉంటుందని.. ప్రకటించాయి. అఖిలపక్షభేటీలోనూ అదే చెప్పారు. దాంతో.. పుల్వామా విషయంలో.. దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చినట్లయింది.
పుల్వామా దాడిని రాజకీయంగా మార్కెటింగ్ చేసుకుంటున్న బీజేపీ..!
పుల్వామా దాడి ఘటన విషయంలో విపక్ష పార్టీలు… కేంద్రానికి ఏకపక్షంగా మద్దతు తెలిపినప్పటికీ. బీజేపీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. ఫిబ్రవరి పధ్నాలుగున… దాడి జరిగితే… ఆ తర్వాత మూడు రోజులకే.. అమిత్ షా అస్సాంలోని ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. ఈ దాడిని చూస్తూ ఊరుకోదు… అంటూ ప్రకటనలు చేశారు. అప్పటికే.. విపక్ష పార్టీలన్నీ మద్దతు పలికినప్పటికీ.. ఇదేదో.. తమ సొంత వ్యవహారం అన్నట్లుగా అమిత్ షా ప్రకటన చేశారు. కనీసం.. దేశం ఊరుకోబోదు అని చెప్పినా… ఐక్యంగా ఉన్నట్లయ్యేది.. కానీ.. రాజకీయ లబ్ది కోసం ప్రకటనలు ప్రారంభించారు. దాంతో ఇతర రాజకీయ పార్టీలు కూడా…ముందడుగు వేశాయి. అధికార పార్టీనే రాజకీయం కోసం ముందడుగు వేసి రాజకీయాలు చేయాలి అనుకున్న తర్వాత ఇతర పార్టీలు కూడా ఊరుకుంటాయా..?. తమ పై నిందలు వేస్తే ఊరుకుంటాయా..?. ఫిబ్రవరి 17వ తేదీకి ముందు ఒక్క విపక్ష పార్టీ కూడా.. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తేనే… దేశద్రోహి, పాకిస్థాన్ ఏజెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. చివరికి చంద్రబాబుపై కూడా అలాగే అంటున్నారు. చంద్రబాబుకు పాకిస్థాన్ ప్రధానిపై ఉన్న నమ్మకం.. దేశ ప్రధానిపై లేదంటూ విమర్శలు చేస్తున్నారు. రేపు టీడీపీ నేతలు.. అలాగే విమర్శలు చేయవచ్చు.. ఓ మతోన్మాద దేశమైన సౌదీ రాజుకు ప్రోటోకాల్ పక్కన పెట్టి మరీ ఎదురెళ్లి కౌగిలించుకున్న మోడీ… సొంత దేశంలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ఎందుకు గౌరవించరని .. టీడీపీ నేతలు ప్రశ్నించవచ్చు. ఈ రకమైన విమర్శల వల్ల.. అధికారంలో ఉన్న వారు.. తాము మాత్రమే రాజకీయం చేస్తూంటాం.. అంటే సాధ్యమయ్యే పని కాదు.
అఖిలపక్షానికి వెళ్లని మోడీ..! అమరవీరులకు సంతాపదినాలేవి..?
పుల్వామా దాడి ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం… పాకిస్తాన్‌పై ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. భారత్ ఏం చేయబోతోందన్నదానిపై.. ప్రపంచం మొత్తం.. భారత్ వైపు చూస్తోంది. ఇలాంటి కీలక సమయంలో నరేంద్రమోడీ.. అఖిలపక్ష సమావేశానికి డుమ్మాకొట్టారు. దేశభద్రతకు సంబంధించి.. ఉమ్మడిగా తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించిన సమావేశానికి గైర్హాజరయ్యేంత ప్రధానమైన… ఇంకో పని ప్రధానికి ఏముంది..?. అలాగే.. ఇంత వరకూ.. అధికారికంగా.. సంతాప దినాలు ఎందుకు పాటించలేదు. 44 మంది సైనికులు చనిపోతే.. దేశంలో ప్రాణత్యాగం చేస్తే..ఇంత వరకూ కేంద్రం స్పందించలేదు. ఎవరైనా మాజీ రాజకీయ నేతలు చనిపోతేనే వారం రోజులు సంతాప దినాలు ప్రకటిస్తారు. సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి పనులు చేయలేదు. అలా చేసి ఉంటే.. వారికి జాతి మొత్తం నివాళి అర్పించినట్లయయ్యేది. ఫిబ్రవరి 18వ తేదీన పాకిస్తాన్‌తో ఇక చర్చలు ఉండవు. దేశంపై దాడికి దిగిన తర్వాత చర్చలేమిటి.. అని మండిపడ్డారు. ఎవరైనా పాకిస్థాన్ తో చర్చలు జరపండి.. అంటే వారిపై యాంటీ నేషనల్ ముద్ర వేశారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ… సౌదీ రాజుతో సమావేశం తర్వాత ఓ కీలక ప్రకటన చేశారు. వారిద్దరూ కలిసి జాయింట్ స్టేట్మెంట్ విడుదల చేశారు. అందులో.. అందులో పాకిస్థాన్‌తో అర్థవంతమైన చర్చల కోసం.. సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని ఉంది. అంతకు ఒక్క రోజు ముందు పాకిస్థాన్‌తో చర్చలే లేవంటారు… ఒక్క రోజకే… సమగ్ర చర్చల కోసమే.. అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు అలా అన్న వారిని దేశద్రోహి అన్నారు. కానీ మోడీ చేస్తే మాత్రం… మంచి వారవుతారా..?.
మన నీళ్లను పాకిస్థాన్‌కు పోనివ్వబోమని ప్రకటనలేంటి..?
పాకిస్థాన్ పై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలన్నీ.. కేంద్రానికి మద్దతు తెలిపితే.. కేంద్రం రాజకీయ ప్రచారం చేసుకుంటోంది. ఏదో చర్యలు తీసుకుంటున్నట్లుగా షో చేస్తోంది. గడ్కరీ.. పాకిస్తాన్‌కు నీళ్లు ఆపేసినట్లు చెప్పుకొచ్చారు. చాలా మంది.. పాకిస్తాన్ తిక్క కుదిర్చారరని అనుకుంటారు. నిజానికి గడ్కరీ ఆపేస్తానన్న నదులపై.. సంపూర్ణ హక్కులు.. ఇండియాకే ఉన్నాయి. వాటి నుంచి నీళ్లు.. యమునా నదికి మళ్లించే ప్రక్రియ ఎప్పటి నుండో సాగుతోంది. మన హక్కు నీళ్లను.. వాళ్లకు విడుదల చేయం అని చెప్పడమే వారి రాజకీయం తెలియచెబుతోంది. పోనీ పాకిస్థాన్‌కు హక్కులు ఉన్న మూడు నదుల నీళ్లను వాళ్లకు పోకుండా చేయగలరా..?. చర్యలు తీసుకోమన్న తర్వాత ప్రచారం చేసుకోవడం ఏమిటి..? అందుకే రాజకీయ పార్టీలు కూడా.. విమర్శలు ప్రారంభించాయి. అలాగే.. దేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఓ అవార్డు తీసుకోవడానికి మోడీ.. విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు అంత అవసరం ఉందా..?. అంత ప్రధానమైన పర్యటననా అదా..? విదేశాంగ మంత్రిని పంపవచ్చు కదా..?.
ఘటనపై అనేక సందేహాలు..! ప్రశ్నిస్తే దేశద్రోహులేనా..?
ఇంటలిజెన్స్ వైఫల్యంపై.. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది..? ముందుగా హెచ్చరికలు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదు..? ఇంటర్నెట్లో వీడియోలు పెట్టినా ఎందుకు లైట్ తీసుకున్నారు.. ? సైనికులను ఎయిర్ లిఫ్ట్ ఎందుకు చేయలేదు..? సౌదీ అరేబియా రాజు వచ్చినప్పుడు.. ఎందుకు పాకిస్థాన్ విషయంలో వారిపై ఒత్తిడి చేయలేదు..? ఇలాంటి ప్రశ్నలన్నీ… ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. కానీ..అడిగితే దేశద్రోహులంటున్నారు. సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా..?