తెలంగాణ దేశంలో అత్యధిక వృద్ధిరేటు సాధిస్తున్న రాష్ట్రం. ఇరవై శాతానికిపైగా ఆదాయ వృద్ధితో దూసుకుపోతోంది…” అని కేసీఆర్ ఎన్నికల ప్రచారసభల్లో ఉదరగొట్టారు. కానీ బడ్జెట్లో మాత్రం.. ఆ వృద్ధి కనిపించలేదు. కేసీఆర్ చెప్పిన వృద్ధి రేటు ప్రకారం చూస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రెండు లక్షల కోట్లు దాటుతుందని భావించారు. కానీ.. కేవలం రూ. లక్ష ఎనభై రెండు వేల పదిహేడు కోట్లకు పరిమితమైంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏటా .. పదిహేను శాతం.. అంకెల్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇలా ప్రతీ ఏడాది పదిహేను శాతం వృద్ధితో బడ్జెట్ ప్రవేశ పెట్టడం వల్ల అంకెలు భారీగా ఉంటున్నాయి కానీ అంచనాలకు ఖర్చుకు అంతరం బాగా పెరిగిపోతోంది. దీంతో ప్రతీ ఏడాది రివైజ్ట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి వస్తోంది.
2018 – 19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,74,453 కోట్లతో బడ్డెట్‌ను ప్రవేశ పెట్టారు. కానీ ఖర్చు రూ. లక్షా నలభై వేల కోట్ల వరకూ రావడం లేదు. అసలు బడ్జెట్‌కు ఖర్చుకు రూ. 30వేల కోట్లకుపైగా తేడా కనిపించడం అసాధారణం. ఇలా ప్రతీ ఏడాది చేయడం వల్ల ఆర్థిక నిర్వహణ పరంగా.. చెడ్డ పేరు వస్తోందన్న అభిప్రాయం ఆర్థిక శాఖ వర్గాల్లో ఏర్పడింది. ఇదే తరహాలో ప్రవేశ పెడితే భవిష్యత్ లో ఈ తేడా భారీగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే.. కేసీఆర్.. ఈ సారి పెంపు మరీ భారీగా ఉండకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో పదిహేను శాతానికి బదులుగా ఐదు శాతం పెంపుతో 2019- 20 ఏడాదికి బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలుస్తోంది.
ఈ పరిస్థితిని.. ఇంత కాలం… బడ్జెట్లలోని డొల్లతనాన్ని బయటపెట్టే సాహసం కానీ.. ప్రశ్నించే ధైర్యం కానీ ప్రస్తుతం తెలంగాణ నేతలకు కానీ..మీడియాకు కానీ లేదు. కేసీఆర్ చెప్పింది వినడం తప్ప వారేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంతేసి వృద్ధిరేటు ఉన్నప్పుడు.. బడ్జెట్ ఎందుకు తగ్గిందనే ప్రశ్న లేవనెత్తితే… చర్చ జరిగితే.. మొత్తం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై.. వివరాలు బయటకు వస్తాయి. ఆ ధైర్యం ఎవరు చేస్తారు..?