కాంగ్రెస్ తరపున గెలిచిన వాళ్లకు మళ్లీ ఏవో హామీలు.. తాయిలాలు ఇచ్చి పార్టీలో చేర్చుకోవడం ఎందుకు.. అసలు వారిని గెలవకుండా చేస్తే పోలా అన్నట్లుగా.. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో.. తనకు నలుగురు ఎమ్మెల్సీలు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. ఐదో అభ్యర్థిని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ ఉలిక్కి పడింది. తమకు రావాల్సిన ఒక్క సీటుపై కూడా కేసీఆర్ కన్నేసినట్లు తెలియడంతో.. ప్రతి వ్యూహం ప్రారంభించింది. పార్టీల బలాబలాలు, గెలుపోటములపై లెక్కలు చూసుకున్న హస్తం పార్టీ తమ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి పెట్టాలని నిర్ణయించింది. పార్టీల సంఖ్యాబలం ప్రకారం టిఆర్ఎస్ పార్టీకి కేవలం నలుగురు ఎమ్మెలసీలను గెలుచుకు నే అవకాశం మాత్రమే ఉంది. కానీ ఐదో స్థానానికి కూడా మిత్రపక్షం ఎంఐఎం తో కలసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది.
అసెంబ్లీ లో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని మొత్తం సభ్యుల సంఖ్య 120. అందులో టీఆర్ఎస్ కు ఇటీవల పార్టీలో చేరిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి 91 మంది సభ్యుల బలం ఉంది. ఎంఐఎం సభ్యులు ఏడుగురు ఉన్నారు. కాంగ్రెస్ కు 19మంది, టీడీపీ2, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ అభ్యర్థి తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఇక టీడీపీ ఇద్దరు సభ్యుల్లో ఒకరు కాంగ్రెస్ కు మిత్రపక్షం కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉండగా మరో ఎమ్మెల్యే సండ్ర మాత్రం టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన కాంగ్రెస్ కు మిత్రపక్షంతో కలిసి 20మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే… ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం 21 ఓట్లు అవసరం. టీఆర్ఎస్ ఐదో ఆభ్యర్థిని నిలిపితే.. ఆ ఐదో అభ్యర్థికి 7 ఓట్లు తక్కువ పడతాయి. కాంగ్రెస్ కు 20 మంది ఉన్నందున ఎలిమినేషన్ పద్దతిలో టిఆర్ఎస్ నిలిపే ఐదో అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఓడిపోతారు. అయినప్పటికీ.. టిఆర్ఎస్ ఏ ధీమాతో ఐదు స్థానాలకు పోటీలో పెడతామని ప్రకటించిది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడమో, లేక గైర్హాజరు కావడమే చేస్తే తప్ప టిఆర్ఎస్ ఐదు స్థానాలు గెలిచే అవకాశాలు లేవు.
అనైతిక చర్యలకు పాల్పడాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఐదో అభ్యర్థిని నిలబెట్టారని.. కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యేలు ఎవరూ హ్యాండివ్వరన్న ఉద్దేశంతో అభ్యర్థిని రంగంలోకి దింపడానికి కసరత్తును ముమ్మరం చేసింది. ఎవరైతే ఎమ్మెల్యేలందరి ఆమోదం ఉంటుందనే లెక్కలు వేసుకుంటోంది. కొంత మంది పేర్లను హైకమండ్కు పంపారు. సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కకు.. ఇది మొదటి పరీక్షలా మారింది.