వైవిధ్యభరితమైన ప్రయత్నాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు కల్యాణ్ రామ్. అతనొక్కడే, హరేరామ్, పటాస్, ఎం.ఎల్.ఏ.. ఇలా తన దగ్గర నుంచి మంచి సినిమాలే వచ్చాయి. ఇటీవల విడుదలైన `నా నువ్వే` బాగా నిరాశ పరిచింది. `కథానాయకుడు`, `మహానాయకుడు`లో తన తండ్రి హరికృష్ణ పాత్రని పోషించి – నందమూరి అభిమానుల్ని మెప్పించాడు. ఇప్పుడు `118`తో థ్రిల్ కలిగించడానికి సిద్ధమయ్యాడు. గుహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్‌తో చిట్ చాట్..
మహానాయకుడు ఫీడ్ బ్యాక్ వచ్చేసిందా?
– మీరు చెప్పాలి సినిమా ఎలా ఉందో..? మా వరకూ నిజమైన ఫీడ్ బ్యాక్ వచ్చేసరికి వారం పడుతుంది.. ఇప్పుడు కాస్త స్పీడప్ అయ్యాం అనుకోండి. రెండు మూడు రోజుల వరకూ.. సరైన ఫీడ్ బ్యాక్ రాదు.
తొలిసారి ఓ థ్రిల్లర్ కథలో నటించాడు.. ఎలా అనిపించింది? ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
– ఇందులో నేను ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్టుగా నటించాను. అలాగని మరీ `ఇజం` తరహాలో ఉండదు. తనకు ఎదురైన చిత్ర విచిత్రమైన పరిస్థితుల నేపథ్యంలో జరుగుతుంది. ట్రైలర్లోనే కథ ఏ తరహాలో సాగుతుందో చెప్పేశాం. అలా ముందుగానే ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాం. ప్రతీ విషయాన్నీ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ హీరోది. ఆ అలవాటు తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో చూపిస్తున్నాం. థ్రిల్లర్ తరహా చిత్రాల్లో నటించడం ఇదే తొలిసారి. చాలా బాగా అనిపించింది.
118కి జస్టిఫికేషన్ ఏమిటి?
– ట్రైలర్లో ఓ డిజిటల్ క్లాక్ చూపించాం కదా? అదొక్కటే కాదు.. ఇంకా రెండు మూడు అంశాలు ఈ టైటిల్‌తో ముడిపడి ఉన్నాయి. అవేంటో తెరపై చూడాలి. రక్షణ, అన్వేషణ లాంటి టైటిళ్లు అనుకున్నాం. కానీ అవి తెలిసిన టైటిల్సే. ఇలాంటి టైటిల్ పెడితే ఉత్సుకత ఏర్పడుతుందనిపించింది.
గుహన్ ఓ కెమెరామెన్‌గా పనిచేశాడు. ఆ అనుభవం దర్శకత్వంలో ఎలా ఉపయోగపడింది?
– తప్పకుండా ప్లస్ అయ్యింది. దర్శకుడు అనుకున్న పాయింట్‌ని కథగా ఎలా చెప్పాలో కెమెరామెన్‌కి తెలుసు. గుహన్ కాకపోయి ఉంటే… ఈ సినిమా ఇలా వచ్చి ఉండేది కాదు. ఇది నిజంగా తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన. దాన్ని కథగా మలిచాడు. కథ వినగానే థ్రిల్లింగ్ గా అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను.
థ్రిల్లర్ తరహా చిత్రాలకు పరిమిత మార్కెట్ ఉంటుంది కదా? ఆ విషయాన్ని ఆలోచించారా?
– నేనెప్పుడు కథ విన్నా ఆసంగతి పట్టించుకోను. బాగుంది అనిపించిన వెంటనే చేసేస్తాను. నా మనసు, నా హృదయం ఏం చెబితే అది చేస్తుంటా. ఫలితం ప్రేక్షకులే చెప్పాలి.
కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఏమైనా ప్రయత్నించారా?
– కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే… ఓ ఐటెమ్ పాట, కామెడీ, హీరోయిజం బిల్డప్పులు ఇవే కదా? అలా అనుకుంటే ఆ మూడూ ఈ సినిమాలో ఉండవు. ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే సినిమా ఇది. వాళ్లకో కొత్త అనుభూతి ఇస్తుంది. కొన్ని సన్నివేశాలు, షాట్స్ ఇది వరకెప్పుడూ తెలుగు సినిమాల్లో చూసి ఉండరు. థ్రిల్లర్‌లో ఎమోషన్ మిక్స్ చేయడం చాలా కష్టం. అవి రెండూ కుదరవు. కానీ ఈ సినిమాలో అది అందంగా కుదిరింది. యువ ప్రేక్షకులు ఎప్పుడూ హై స్పీడ్ నేరేషన్ కోరుకుంటారు. అది ఈ సినిమాలో ఉంటుంది.
రివర్స్ స్క్రీన్ ప్లేలో సాగే సినిమానా?
– అదేం కాదు. ఓ కథని సూటిగా చెప్పాం. రివర్స్ స్క్రీన్ ప్లే అంటూ గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి, దెబ్బతిన్నా.. మళ్లీ ఎందుకు…? (నవ్వుతూ)
మీతో పనిచేసిన అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి పెద్ద దర్శకులు అయిపోయారు.. వాళ్లతో సినిమా ఎప్పుడు?
– ఆ మాట అంటుంటే సంతోషంగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి ఇద్దరు మంచి దర్శకుల్ని ఇచ్చాం. వాళ్లతో మళ్లీ పనిచేయాలనివుంది. మంచి కథ దొరగ్గానే చేస్తాం.
తరవాత సినిమాలేంటి?
– రెండు మూడు కథలు సిద్దంగా ఉన్నాయి. 118 తరవాత ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటా.
ఈమధ్య సినిమాలు విడుదలైన నెల రోజులకే అమేజాన్‌లో వచ్చేస్తున్నాయి. ఇది నిర్మాతలకు ప్లస్ అంటారా? మైనస అంటారా?
– ఇది వరకు సినిమా విడుదలైన వంద రోజుల వరకూ టీవీలో ప్రదర్శించేవారు కాదు. ఇప్పుడు వంద రోజుల సినిమాలు లేవు. అందుకే.. అంత సమయం ఆగాల్సిన అవసరం లేదు. కాకపోతే నెల రోజులు అన్నది మరీ తక్కువ వ్యవధి. 50 రోజుల తరవాత అయితే బాగుంటుంది.