పుల్వామా దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రధానికి మద్దతుగా ఉన్నాయనీ, చంద్రబాబుకి ఈ దేశ ప్రధాని కంటే పాక్ ప్రధానిపై నమ్మకం ఉందా అంటూ భాజపా అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించి వెళ్లిపోయిన సంగతీ తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారనీ, అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల తీవ్రవాద దాడి జరిగిందనీ, ఆ సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీ ఎలా స్పందించారో గల్లా జయదేవ్ గుర్తుచేశారు. ప్రధానమంత్రి పదవి నుంచి మన్మోహన్ తప్పుకోవాలని, రాజీనామా చేయాలని నాడు మోడీ అన్నారనీ, అదే తరహా ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకు సహించలేకపోతున్నారని అన్నారు.
మోడీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటారా అని నిలదీశారు. దేశభక్తి, జాతీయత అనేవి కేవలం నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్న హక్కులు కావనీ, మనదేశంలో ప్రతీ పౌరుడూ దేశభక్తుడే అన్నారు. పౌరులు ప్రశ్నిస్తే… ఎదురు ప్రశ్నించడం మంచిది కాదన్నారు. దాడి జరిగింది 3 గం. 10 నిమిషాలకైతే.. ఆ సమయంలో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ప్రధాని ఉన్నారనీ, డిస్కవరీ ఛానెల్ కోసం ఒక ఫిల్మ్ షూటింగ్ లో ఉన్నారన్నారు. ఆయన ఇగో ఎంత పెద్దదో, ప్రచారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలిసిందే అంటూ ఎద్దేవా చేశారు. అయితే, దాడి జరిగిన సమయం నుంచి… మూడున్నర గంటలపాటు షూటింగ్ కొనసాగించారన్నారు. అయితే, తీవ్రవాద దాడి జరిగింది అనే విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎప్పుడు తెలిసిందో ప్రజలకు చెప్పాలన్నారు జయదేవ్.
3:10కి దాడి జరిగితే.. ఆరున్నర వరకూ ప్రధాని స్పందించలేదన్నారు. అంటే, మూడున్నర గంటలపాటు ఆయనకి సమాచారం లేదని భావించాలా అన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్లినా సమాచారం అందుతుందనీ, దాడి ఘటన జరిగిన వెంటనే ప్రధానికి కచ్చితంగా సమాచారం అంది తీరుతుందనీ, అలాంటప్పుడు ప్రధాని ఎందుకు ఆలస్యంగా స్పందించారని జయదేవ్ ప్రశ్నించారు. ప్రధాని అందుబాటులో లేరు అనుకుంటే… అది కూడా వైఫల్యం కిందికే వస్తుంది కదా అన్నారు. కాబట్టి, పుల్వామా దాడి జరిగిందని ప్రధానమంత్రికి ఎప్పుడు తెలిసింది అనేది చెప్పాలని గల్లా డిమాండ్ చేశారు. మరి, జయదేవ్ అడిగిన ప్రశ్నకు భాజపా నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. రొటీన్ గా అయితే… అడిగిన ప్రశ్నలో అసలు అంశం పక్కనపెట్టి, అదిగో టీడీపీవారు తీవ్రవాద దాడిపై అదోలా స్పందిస్తున్నారూ, వారికి దేశభక్తి లేదా అనే కోణాన్నే భాజపా నేతలు ఎత్తుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.