ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతంలో రాసే రాజకీయ వ్యాసం.. “కొత్తపలుకు”లో… అతిశయోక్తులు ఉంటాయని ఎవరూ చెప్పరు కానీ.. టీడీపీకి అనుకూలంగా ఉంటాయని.. మాత్రం అంగీకరిస్తారు. అయితే.. అందులో అవాస్తవాలు ఉంటాయని మాత్రం.. చెప్పలేరు. కానీ ఆయన వాదనను మాత్రం.. మరో విధంగా ఖండించడానికి ప్రయత్నిస్తారు. ఈ వారం రాసిన ఆర్టికల్‌లోనూ… అంతకు మించిన వాదనలు వినిపించడం ఖాయమే. ఎందుకంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. జరుగుతున్న రాజకీయాన్ని.. ఏపీలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా… ఏకమైన విషయాన్ని… హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయాన్ని… విపులంగా చెప్పే ప్రయత్నాన్ని… ఆర్కే చేశారు.
” చంద్రబాబు విషయంలో కొంతమంది అసూయతో, మరికొంతమంది ద్వేషంతో, ఇంకొందరు కక్షతో రగిలిపోతున్నారు. జగన్మోహన్రెడ్డి అండ్ కోకు కక్ష, భారతీయ జనతా పార్టీ నాయకులకు ద్వేషం, దగ్గుబాటి అండ్ కోలో అసూయ, అక్కసు ఉన్నాయి. ఈ వర్గాలే కాకుండా హైదరాబాద్‌లో స్థిరపడిన చంద్రబాబు వ్యతిరేకులు కొందరు రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఓడించడానికై పంచెలు సర్దుకుంటున్నారు. ఇలాంటి వారిలో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులే కాదు.. ఓ న్యాయమూర్తి కూడా ఉన్నారని..” తేల్చారు. చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించడానికి.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని.. అందుకే.. కమ్మ సామాజివర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదన తెరపైకి తెచ్చారని.. చివరికి.. వైసీపీలో చేరిన కమ్మ సామాజికవర్గ నేతలు కూడా అదే ఆరోపణలు చేయడం దీనికి నిదర్శనమంటున్నారు ఆర్కే. “చంద్రబాబుపై ఎప్పటినుంచో కత్తులు నూరుతూ వస్తున్న ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ న్యాయమూర్తి కూడా ఇప్పుడు జగన్మోహన్రెడ్డికి పరోక్షంగా అండదండలు అందిస్తున్నారు…” అని ఆర్కే తేల్చారు. వీరెవరన్న పేర్లు బయటపెట్టలేదు.
జగన్‌ను నాగార్జున కలవడంపైనా.. ఆర్కే… నిశితమైన విశ్లేషణ చేశారు. దాని వెనుక రాజకీయం ఉందని తేల్చారు. కోడికత్తి దాడి జరిగినప్పుడు కూడా పరామర్శించని నాగార్జున ఇప్పుడే ఎందుకు వెళ్లారనేది..ఆయన లాజిక్. దానికి హైదరాబాద్‌లోని ఆయన ఆస్తుల లింక్ పెట్టారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఉన్న ఆస్తులే టార్గెట్‌గా చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ ఇస్తున్నారని ఆర్కే తేల్చారు. అంతే కాదు.. తలసాని.. ఏపీలో బీసీలకు నాయకత్వం వహిస్తానని చెప్పడం వెనుక కోణాన్ని ఆసక్తికరంగా విశ్లేషించారు. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఆంధ్రుల పెత్తనాన్ని సహించలేదు.. మరి ఆంధ్రులు తెలంగాణ పెత్తనాన్ని సహించేలా కులం కోణంలో… వస్తున్నారని కూడా చెబుతున్నారు. ” ఈ బక్కోడికి వ్యతిరేకంగా ఇంతమంది ఏకమవుతారా? అని ప్రశ్నించి ప్రజల సానుభూతి పొందడానికి కేసీఆర్ ప్రయత్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శరీర దారుఢ్యం దృష్ట్యా చూస్తే బక్కోడే! అప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా అందరూ ఒక్కటైనట్టుగా ఇప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారు. అయితే కేసీఆర్ విషయంలో ప్రత్యర్థులు ఎవరో స్పష్టంగా కనపడింది. చంద్రబాబు విషయంలో అలా కాదు. ప్రత్యర్థులను గుర్తించడం కూడా కష్టంగా ఉంటోంది…” అని విశ్లేషించారు.
కులం కోణంలో ఏపీలో జరుగుతున్న రాజకీయాల్ని… దుష్ప్రచారం చేసి ప్రజల మనసుల్లో విద్వేషం రేపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా.. ఆర్కే తన కొత్త పలుకులో విశ్లేషించారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయాల్ని చంద్రబాబునాయుడు… సంక్షేమంతో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన.. ఇప్పుడు జగన్ గెలవాలని … చంద్రబాబును ఓడించాలని ప్రయత్నిస్తున్న వారికి.. భవిష్యత్ చిత్రం ఎలా ఉంటుందో.. జగన్ ఎలా వ్యవహరిస్తారో.. ఫినిషింగ్ టచ్‌లో విశ్లేషించే ప్రయత్నం చేశారు. వైఎస్‌కు… జగన్‌కు ఉన్న తేడాను… గౌరు కుటుంబానికి ప్రస్తుతం దక్కుతున్న ఆదరణ ఉదాహరణగా చెప్పారు. అది ఒక్కటి చాలు.. జగనే రావాలని కోరుకుంటున్న వారు.. ఆయనొస్తే..ఏదో లాభం జరిగిపోతుందని ఆశించేవారు.. కాస్త ఆలోచించడానికి అన్నట్లుగా ఆర్టికల్‌లో ఆర్కే ప్రజెంట్ చేశారు.