జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించబోతున్నారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత చాలా తక్కువ సందర్భాల్లోనే ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. అదీ కూడా… ప్రత్యేకంగా రాజకీయ కార్యాచరణ పెట్టుకోలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం.. ఏకంగా మూడు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఓ రకంగా.. మొదటి సారి పూర్తి స్థాయి పర్యటన ఇది. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో జనసేనకు దాదాపుగా అస్థిత్వం లేదు. పవన్ కల్యాణ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ.. దాన్ని ఇక్కడ.. ఓ పార్టీ వ్యవస్థలా తీర్చి దిద్దడంలో విఫమయ్యారు. అందుకే.. ఈ మూడు రోజుల పర్యటనలోనే.. కర్నూలు జిల్లాలోనూ.. జనసేన బలంగా ఉందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాల్సి ఉంది.
వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ.. కర్నూలులో మంచి ప్రదర్శన చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ గెలుచుకున్న పద్దెనిమిది అసెంబ్లీ స్థానాల్లో… రెండు.. కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. రాయలసీమలో.. చిరంజీవి పోటీ చేసిన తిరుపతి తర్వాత.. గెలుచుకున్న రెండు స్థానాలు… కర్నూలు జిల్లాలోనివే. ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు. వారు .. పీఆర్పీని కాంగ్రెస్‌లో కలిపేదాకా… చిరంజీవి వెంటే ఉన్నారు. పీఆర్పీ తరపున ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిన జిల్లాలో… జనసేన కూడా.. అలాంటి ప్రభావాన్ని ఆశించడం అత్యాశ కాదు. పవన్ కల్యాణ్ ఆ దిశగా ఇప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారనుకోవాలి.
పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు పోరాటయాత్రలు.. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలోనే నిర్వహించారు. నెలల తరబడి పోరాటయాత్రలు జరిగాయి. కానీ.. ఎన్నికల సమయం దగ్గర పడటంతో.. వాటికి విరామం ఇచ్చి సంస్థాగత వ్యవహారాలు చక్క బెడుతున్నారు. అయితే.. ఈ రెండు నెలల్లోనూ ఆయన సీమ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టిన సందర్భం లేదు. ఇప్పుడు .. రంగంలోకి దిగారు. ఈ మూడు రోజుల పర్యటనలోనే కొంత మంది కీలక నేతల్ని చేర్చుకుని.. బలంగా ఉన్నామని భావిస్తున్న నియోజకవర్గాల్లో… అభ్యర్థులపై క్లారిటీ ఇస్తే… జనసేన కూడా.. కర్నూలు జిల్లా లో రేసులో ఉండే అవకాశం ఉంటుంది. సినిమా సక్సెస్ టూర్లలా.. ర్యాలీలు నిర్వహించి మేధావులతో మాట్లాడేసి వస్తే మాత్రం… పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.