నిన్న “జగనే ఆంధ్రప్రదేశ్ కి కాబోయే సీఎం” అంటూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు 100% ఓడిపోతారు అని, ఢిల్లీలో కాదు కదా కనీసం విజయవాడలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేరని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అలాగే టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో ఆస్తులు ఉన్న టిడిపి నేతలను బెదిరించి, బలవంతం చేసి వైఎస్ఆర్ సీపీలో చేర్పిస్తున్నారు అని చంద్రబాబు ఆ మధ్య చేసిన వ్యాఖ్యలను కూడా కేటీఆర్ ఖండించారు. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలపై జనసేన అభిమానులు గుర్రుగా ఉన్నారు.
తెలంగాణ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చిన జనసేన అభిమానులు
2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అభిమానులు, వైఎస్ఆర్సిపి అభిమానులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు మహాకూటమిలో కలవడంతో, చంద్రబాబు ను వ్యతిరేకించే జనసేన , వైఎస్ఆర్ సీపీ అభిమానులు పూర్తిస్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే ఎన్నికలకు ముందు, కేటీఆర్ కూడా కాపు తదితర సామాజిక వర్గాలు ఏర్పాటు చేసుకున్న వన భోజనాల కి హాజరై టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అది ఎంతోకొంత ఫలితాన్నిచ్చింది కూడా.
ఉదాహరణకి కూకట్పల్లి అసెంబ్లీ నియోజక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా భావిస్తారు. మాధవరం కృష్ణారావు 2014 లో అంత టిఆర్ఎస్ ప్రభంజనం లో కూడా టిడిపి టికెట్ మీద నెగ్గారు. అయితే ఆయన ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో 2018 ఎన్నికలలో నందమూరి సుహాసిని చేతిలో ఈయనకు ఓటమి తప్పదు అని ఎంతో మంది విశ్లేషకులు భావించినప్పటికీ ఆయన దాదాపు 40 వేల ఓట్ల మెజార్టీతో నందమూరి సుహాసిని పై గెలిచారు. దీనికి టి.ఆర్.ఎస్ మీద ఉన్న సానుకూల ఓటు ఎంత కారణమో, వై ఎస్ ఆర్ సి పి , జనసేన అభిమానులు గంప గుత్తగా టిఆర్ఎస్ కు ఓటు వేయడం కూడా అంతే కారణం.
జగన్ మీద రాళ్లు రువ్విన పరిస్థితి నుండి “జగనే సీఎం” వరకు ఎలా వచ్చింది?
జగన్ ఓదార్పు యాత్ర మొదలు పెట్టిన కొత్తలో తెలంగాణలో పర్యటించడానికి పూనుకున్నప్పుడు జగన్ మీద టిఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్విన విషయం తెలిసిందే. అప్పట్లో వైఎస్ఆర్సిపి నేతలకు టీఆర్ఎస్ నేతలకు మధ్య బలమైన వాగ్వాదాలు కూడా జరిగాయి. అయితే తర్వాత తర్వాత పరిస్థితులు మారాయి. వైఎస్ఆర్ సీపీకి తెలంగాణలో ఉనికి పోయాక టిఆర్ఎస్ కూడా వైఎస్ఆర్సిపి మీద ఉన్న వ్యతిరేకతను తుడిచేసింది. పైగా చంద్రబాబు పలు కారణాల వల్ల టిఆర్ఎస్కు శత్రువుగా మారడం తో, టిఆర్ఎస్ మరియు వైఎస్ఆర్ సీపీల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది.
అయితే రాజకీయ కారణాలతో పాటు వ్యాపార సంబంధాలు కూడా టిఆర్ఎస్ మరియు వైఎస్ఆర్సిపి ల మధ్య బంధం బలపడటానికి కారణం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ మరియు కేటీఆర్ ల మధ్య బంధం బలపడడానికి మైహోమ్ రామేశ్వరరావు ప్రధాన కారణం అని తెలియవస్తోంది. కెసిఆర్ సామాజిక వర్గానికి చెందిన మైహోమ్ రామేశ్వరరావు, తన మై హోమ్ గ్రూప్ ని గత కొన్నేళ్లలో తెలంగాణలో నంబర్ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీ గా మార్చారు. అంతేకాకుండా టీవీ9 మరియు టీవీ10 లలో పెట్టుబడులు పెట్టారు. కెటిఆర్ మరియు జగన్ ల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించింది రామేశ్వర రావే అనే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఈ రెండు ఛానెల్స్ జగన్ కి కాస్త అనుకూలంగా మారడం కూడా తెలిసిన సంగతే
పార్లమెంటు ఎన్నికలలో జనసేన అభిమానులు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారా?
జగనే సీఎం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో పాటు, ఇటీవల కొంతకాలంగా తలసాని తదితర టిఆర్ఎస్ నేతలు పూర్తిగా వైఎస్ఆర్సిపి కి అనుకూలం గా మారిపోవడం జనసేన అభిమానులకు నచ్చడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, సంఖ్యాపరంగా అధికంగా ఉన్న తాము టీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తే ఇప్పుడు టిఆర్ఎస్ పూర్తిగా జగన్ కి అనుకూలంగా మాట్లాడటం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలలో తమకు వ్యతిరేకంగా పని చేసినందుకు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యానించిన కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రత్యక్షంగా వేలు పెట్టకుండా ఆ పని చేసి ఉంటే బాగుండేదని, కానీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో నేరుగా తలదూర్చడమే కాకుండా జగన్ కి మద్దతు ఇవ్వడం ఏంటని వారు అడుగుతున్నారు.
మొత్తం మీద:
ఇంతకీ టిఆర్ఎస్ మద్దతు వల్ల వల్ల జగన్ కు ఏమైనా ఉపయోగం ఉంటుందా లేక నష్టం కలుగుతుందా అని ఆ మధ్య మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని ప్రశ్నిస్తే ఆయన దీనివల్ల జగన్ కు కలిగే నష్టం ఉండకపోవచ్చు కానీ అలాగని లాభం కూడా ఉండదు అని సమాధానమిచ్చారు. ఇదే ప్రశ్నను ‘జగన్ కి మద్దతు ఇవ్వడం వల్ల టిఆర్ఎస్కు లాభమా నష్టమా’ అని మరొక లాగా వేసుకుంటే, తన ఫెడరల్ ఫ్రంట్ లో తమతో పాటు వైయస్సార్సీపి అనే మరొక పార్టీ కూడా ఉంది అని చెప్పుకోవడానికి ఇది టీఆర్ఎస్ కు ఉపయోగ పడవచ్చు కానీ, క్షేత్రస్థాయిలో జనసేన అభిమానులు లేదా తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న మెగా అభిమానులు అనే ఒక వర్గాన్ని దూరం చేసుకోవడం టిఆర్ఎస్ కు ఎంతో కొంత నష్టం కలిగిస్తుందని చెప్పవచ్చు.