జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఈరోజు కర్నూలులో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
కర్నూలు తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పవన్
సుస్వాగతం సినిమా విడుదలైన కొత్తలో తాను కర్నూలుకు వచ్చానని, అప్పుడు తనను నిర్వాహకులు ఒక రోడ్ షో చేయమని అడిగారని , అయితే తనను చూడడానికి ఎవరు వస్తానని తాను వారితో అన్నానని, కానీ తీరా రోడ్ షో చేస్తే అసంఖ్యాకంగా జనాలు వచ్చారని, అన్ని లక్షల మంది నాకోసం వచ్చారా అని ఆశ్చర్యం వేసింది అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ రోజే ఈ ప్రజల కోసం ఏదైనా భవిష్యత్తులో చేయాలని తాను నిర్ణయించుకున్నానని ఆరోజు ఇప్పుడు వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు.
అలాగే తన మొదటి మూడు సినిమాలు- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం కర్నూలులో 100 రోజులు ఆడాయి అని గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్, ఆ మూడు సినిమాలు కూడా టీజీ వెంకటేష్ థియేటర్లలోనే 100 రోజులు ఆడాయి అని చెప్పుకొచ్చారు. బహుశా అందుకేనేమో ఆయన తన మీద ఎంత పదునైన వ్యాఖ్యలు చేసినప్పటికీ , ఆయనకు కాస్త గౌరవం ఇస్తూ మెత్తగానే మాట్లాడుతున్నానని పవన్ సరదాగా అన్నారు.
రాయలసీమ సెంటిమెంట్ టచ్ చేసిన పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం రాయలసీమ సెంటిమెంటును టచ్ చేస్తూ, స్థానికులను ఆకట్టుకునేలా సాగింది. కొండ రెడ్డి బురుజు వద్ద ప్రసంగించిన పవన్ కళ్యాణ్, కొండా రెడ్డి ని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, కాటమరాయుడు ని తన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పై తిరగబడ్డారు అని, అదే స్పూర్తితో జనసైనికులు పనిచేస్తే కర్నూలు జిల్లాలోని కంచుకోటను బద్దలు చేయడం అసాధ్యమేమీ కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ప్రస్తావించిన ప్రతిసారి జనం నుండి విపరీతమైన స్పందన వచ్చింది.
అలాగే అత్తారింటికి దారేది సినిమాలో కాటమ రాయుడా కదిరీ నరసింహుడా అన్న పాట ఉందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ఆ కాటమరాయుడు పుట్టింది కర్నూలు జిల్లాలో నేనని, అతను గొర్రెలు కాచుకునే వ్యక్తి అని, తన గొర్రెలను కాచుకోవడానికి నెల్లూరు వెళ్ళినప్పుడు, శిస్తు చెల్లించి మరీ గొర్రెలను కాచుకుంటున్నప్పటికీ నెల్లూరు రాజులు తనను ఇబ్బందులకు గురి చేస్తే, ఆ రాజుల పైన కాటమరాయుడు తిరగబడ్డాడు అని, అలాంటి కాటమరాయుడు స్ఫూర్తి ఇప్పుడు మన అందరికీ కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
జనసేన లేకుండా రాష్ట్ర రాజకీయాలు ఉండవు
2019 ఎన్నికల్లో రాష్ట్రానికి ఎంతో కీలకం అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, జనసేన లేకుండా రాష్ట్ర రాజకీయాలు సాగే పరిస్థితి లేదని అన్నారు. రానున్నది సంకీర్ణ యుగం అని చెప్పిన పవన్ కళ్యాణ్, జనసేన రాష్ట్రంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించబోతోంది అని చెప్పారు. జగన్ లాగా 30 ఏళ్ల పాటు నేనే సీఎం గా ఉండాలి అని నేను కోరుకోవడం లేదని, అలాగే చంద్రబాబు లాగా నేనే సీఎం కావాలి నా తర్వాత నా కొడుకు సీఎం కావాలి అని కూడా తాను అనుకోవడం లేదని, అన్న పవన్ కళ్యాణ్, పాతికేళ్ల పాటు రాజకీయాల్లో పాత్ర పోషించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో మీరు ఏ స్థానం ఇస్తే ఆ స్థానం తీసుకుంటానని, అంతే తప్ప ఎన్నికల కోసం మిమ్మల్ని డబ్బుతో ప్రలోభపెట్టడం, లేదా మిగతా రాజకీయ పార్టీలలాగ విలువ లేని పనులు చేయడం తాను చేయనని పవన్ అన్నారు. రాయలసీమ నుండి ఎంతో మంది ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటికీ, ఇప్పటికీ రాయలసీమ వెనకబడి ఉందని, కనీసం తుంగభద్ర నదిని కాలుష్యం బారి నుంచి తప్పించడం కూడా వారు చేయలేకపోయారని, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని, 25 ఏళ్లపాటు మీకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు.
మొత్తం మీద:
మొత్తం మీద పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన కర్నూలులో భారీీ జనసందోహం తో ప్రారంభమైంది. అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగం లో వైయస్ జగన్ మీద కానీ చంద్రబాబు మీద కానీ మరీ తీవ్రమైన విమర్శలు లేకుండా, యువతను మార్పు కోసం కట్టుబడి ఉండాల్సిందిగా చెప్పడం మీద, మీరు కోరుకున్న మార్పు రావాలంటే ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పడం మీద ఫోకస్ చేసి నట్టుగా అనిపించింది. అయితే యువత మాత్రం సీఎం నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. రానున్న వారమంతా పవన్ పర్యటన ఎలా కొనసాగుతుందో చూడాలి.
– జురాన్ ( @CriticZuran)