ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి… ఈ ముగ్గురిపై సెటైర్ వేశారు సీఎం చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ చంద్రదేవ్ పార్టీలో చేరిక సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఆంధ్రాలో జగన్ సీఎం అవుతారంటూ కేటీఆర్ అంటున్నారనీ, తాను ముఖ్యమంత్రిగా ఉంటే వారి ఆటలు సాగవన్నారు. ఆంధ్రా ప్రాంతం అభివృద్ధి కాకూడదనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కి, నరేంద్ర మోడీకి ఉండటం దుర్గమార్గమైందన్నారు. మీకు శక్తి ఉంటే అభివృద్ధిలో పోటీపడాలి, అంతేగానీ, అభివృద్ధిని అడ్డుకుని ఈ ప్రాంతాన్ని వెనక్కి తీసుకుపోతామంటే అది సాధ్యమయ్యే పనికాదన్నారు.
హైదరాబాద్ ని ఎంతగా అభివృద్ధి చేశామో అందరికీ తెలిసిందేననీ, ఇప్పటికీ హైదరాబాద్, అహ్మదాబాద్ లకు పోలిక లేదనీ, అదే నరేంద్ర మోడీ బాధ అన్నారు సీఎం చంద్రబాబు. తెలంగాణ ఆదాయం ఉన్న రాష్ట్రమనీ, కట్టుబట్టలతో ఆంధ్రాకి వచ్చేశామనీ, అయినా అక్కడి నుంచి అభివృద్ధి కోసం చాలా పనులు చేశామనీ, అవేవీ అక్కడ ఆయన చెయ్యలేకపోయాడనీ, అది కేసీఆర్ బాధ అన్నారు. పులివెందులకు కూడా కృష్ణా నీళ్లు ఇప్పిస్తానని చెప్పి మరీ నీళ్లిచ్చామనీ, మనం చూపించిన అభివృద్ధి ఇలా ఉంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డి బాధ ఇదే అన్నారు. అందుకే, ఆయన కోడి కత్తి కేసంటారనీ, పోలవరం కాలువలకు గండిపెడతారనీ, రాజధాని రాకూడదంటారని విమర్శించారు. అమరావతిలో ఏమీ జరగలేదూ, గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయంటారన్నారు. ఎప్పుడైనా ముందుగా గ్రాఫిక్సే ఉంటాయనీ, ఆ తరువాత ఇప్పుడు భవనాలు లేస్తున్నాయనీ, వాటిని చూసి లబోదిబో అంటే ఏమీ ఉపయోగం ఉండదన్నారు.
అవినీతి సొమ్ముతో సాక్షి పత్రిక పెట్టారనీ, అడక్కుండానే దుకాణాల్లో వాటిని వేసేస్తున్నారనీ, అలాంటి పత్రికని బాయ్ కాట్ చేస్తేనే ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఆ పత్రికలో అన్నీ కట్టుకథలే అన్నారు. వారికి ఉండే కులగజ్జిని తనకు అంటించే ప్రయత్నం చేస్తున్నారనీ, అది జరగని పని అని జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ లో ఆస్తులున్నవారిని కేసీఆర్ బెదిరిస్తున్నారనీ, కేంద్ర సంస్థల్ని అడ్డుపెట్టుకుని టీడీపీకి మద్దతు ఇచ్చేవారిపై మోడీ దాడులు చేస్తున్నారన్నారు. జగన్, కేసీఆర్, మోడీ… ఈ ముగ్గురినీ ఒకేగాటన కట్టి చంద్రబాబు విమర్శించారు. ఈ ముగ్గురూ ఏపీకి ఏదో ఒకరూపంలో నష్టం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రచార అజెండాలో ఇదే ప్రధాన ప్రచారాంశంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.