ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొణతాల రామకృష్ణ.. ఇరవై ఎనిమిదో తేదీన తెలుగుదేశం పార్టీలో చేరవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆ రోజున ఆయన .. టీడీపీ అధినేతను కలవనున్నారు. గత ఎన్నికల సమయంలో .. వైసీపీలో ఉన్న ఆయన.. జగన్ తీరు నచ్చక తర్వాత బయటకు వచ్చేశారు. అప్పట్నుంచి ఏ పార్టీలోనూ చేరలేదు. టీడీపీలో చేరుతారని.. చాలా సార్లు ప్రచారం జరిగినప్పటికీ.. ఆచరణలోకి రాలేదు. ఈ లోపు ఉత్తరాంధ్ర చర్చా వేదిక ను పెట్టి.. దాని ద్వారా.. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడుతున్నారు. రైల్వేజోన్ కోసం ఢిల్లీలో కూడా ధర్నా చేశారు. వెనుకబడిన జిల్లాలకు నిధులను కేంద్రం నిలిపి వేయడంపై.. కోర్టులో పోరాడుతున్నారు. ప్రస్తుతం.. ఈ కేసు హైకోర్టులో ఉంది. నిధులు ఎందుకు నిలిపివేశారని.. కోర్టు సూటిగా ప్రశ్నిస్తున్నా.. కేంద్రం మాత్రం… చెప్పేందుకు సమయం కావాలని వాయిదాలు వేస్తూ ఉంది. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న కొణతాల.. టీడీపీ వైపే మొగ్గుచూపుతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
కొణతాల రామకృష్ణ అనకాపల్లి నియోజకవర్గంలో బలమైన అనుచరవర్గం కలిగి ఉన్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సోదరుడ్ని నిలబెట్టారు. కానీ అక్కడ టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ సారి కొణతాల రామకృష్ణనే.. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నిలబెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. కొణతాల కూడా.. అదే ఆసక్తితో ఉన్నారు. అనకాపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్… వైసీపీలోకి ఫిరాయించడంతో.. అక్కడ సీటు ఖరారు చేయడానికి టీడీపీ అధినేతకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఉత్తరాంధ్రలో ముఖ్యంగా.. విశాఖలో ఒక్కరంటే.. ఒక్క బలమైన నేత కూడా లేకపోవడంతో.. వైసీపీ నేతలు కూడా… కొణతాలను పార్టీలోకి ఆహ్వానించారు. గత వారంలో రెండు సార్లు కొణతాలతో సమావేశమయ్యారు. కానీ… పార్టీలో ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి తనకు చేసిన అవమానాలను గుర్తు చేసిన కొణతాల… మరోసారి.. తాను అలాంటి పరిస్థితుల్లోకి రావాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.