ఒక ఇన్వెస్టిగేటివ్ కథనం రాసేటప్పుడు… ఆ కథనానికి బలం చేకూర్చే ఆధారాలను పక్కాగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ప్రభుత్వంలో కీలకమైన విభాగాలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని చెప్పాలనుకుంటే… దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు పక్కాగా సేకరించాలి. ఇలాంటివన్నీ సరిచూసుకున్నాకే… ప్రభుత్వం పనితీరుపై విమర్శలు ఎక్కుపెట్టాలి. అంతేగానీ, తమకు ఉన్న అనుమానాలకు ఆధారాలతో పనిలేకుండా, డెస్క్ లో కూర్చుని కథలు రాసేస్తే దాన్ని జర్నలిజం అనరు! నేటి సాక్షి పత్రికలో అలాంటిదే ఓ కథనం వచ్చింది. ‘రాజకీయ ప్రత్యర్థులపై టాపింగ్ అస్త్రం’ అంటూ ఒక స్టోరీ రాసేశారు.
ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారంటూ రాశారు! తన రాజకీయ ప్రయోజనాలను అనుగుణంగా కాల్ ఇంటర్ సెప్టర్ వ్యవస్థను వాడుకుంటున్నారనీ, తన రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లు టాపింగ్ చేయాలంటూ ఆ విభాగానికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి కోసం పోలీస్ వ్యవస్థే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనీ, టీడీపీ రాజకీయాలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. విశాఖ ప్రాంతానికి చెందిన కొంతమంది రాజకీయ ప్రత్యర్థులపై ఇటీవలే విజిలెన్స్ దాడులు జరిగాయనీ, ఫోన్ టాపింగ్ వల్లనే ఇవి జరిగాయని రాశారు. ఈ మధ్య కొంతమంది ఉన్నతాధికారులను కూడా ఈ టాపింగ్ కు అనుకూలంగా ఉండే విధంగా బదిలీలు చేశారనీ, ఫోన్ టాపింగుల కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారని రాశారు. రానున్న రోజుల్లో ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడటం మరింత ఎక్కువైపోతుందనే ఆందోళన కూడా సాక్షి వ్యక్తం చేసింది.
ఈ కథనంలో, ఫోన్ టాపింగ్స్ చేయాలంటూ సీఎం ఆదేశాలు ఇచ్చారని రాశారు! ఇంతకీ ఆయన ఎవరికి ఆదేశాలు ఇచ్చారు, ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, అవి సాక్షి ఎలా తెలిసింది అనేవి లేవు. అడ్డగోలుగా వాడేసుకుంటున్నారని రాశారే తప్ప… అలాంటి ఒక్క సందర్భాన్ని కూడా కథనంలో చెప్పలేకపోయారు. పోలీస్ వ్యవస్థ అంతా సీఎం రాజకీయాలకు అనుగుణంగా పనిచేస్తోందనేశారు, అలాంటి ఘటన ఒక్కటైనా పక్కాగా చెప్పలేదు. సాక్షి ఆరోపించాలనుకున్న అంశాలకు బలం చేకూర్చే ఒక్క పాయింట్ కూడా ఈ కథనంలో లేదు. వారికి ఏదో అనుమానం కలిగింది, ఏదో భయం వేస్తోంది… దాన్ని బయటపెట్టుకోవడం ఒక్కటే దీన్లో కనిపించింది! ఎన్నికల వేళ సర్కారు బరితెగింపు అని రాసేటప్పుడు… కనీసం ఒక్కటంటే ఒక ఉందతమైనా ఈ కథనంలో ఉంటే దానికి కొంత బలం ఉండేది. మరి, ఇలాంటి కథనాలను ప్రజలు నమ్ముతారని వారు అనుకుంటే… అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు.