ఓసారి హిట్టయిన సినిమాల టైటిళ్లని మరోసారి వాడుకోవడం రిస్క్ అనుకుంటారు సినీ జనాలు. అది నిజం కూడా. పాత హిట్ సినిమాల్ని గుర్తు చేసే ప్రయత్నం చాలాసార్లు బెడసి కొట్టింది. కానీ నాని మాత్రం హిట్ సినిమా పేర్లన్నీ యదేచ్ఛగా వాడేస్తున్నాడు. పిల్లజమిందారు. కృష్ణార్జున యుద్ధం, మజ్ను. జెంటిల్మెన్, దేవదాస్… ఇవన్నీ పాత సినిమాల టైటిళ్లే. తను మళ్లీ కొత్తగా పెట్టుకున్నాడు. కృష్ణార్జున యుద్ధం ప్లాప్ అయ్యింది. దేవదాస్ ఓ మాదిరిగా ఆడింది. అయితే పాత సినిమాలపై మోజు మాత్రం తగ్గలేదు. తాజాగా ‘గ్యాంగ్ లీడర్’ని వాడేశాడు. మిగిలిన సినిమా టైటిళ్లు వేరు, ఈ గ్యాంగ్ లీడర్ వేరు. చిరంజీవిని నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లి, అక్కడే పదేళ్ల పాటు కూర్చోబెట్టేసిన సినిమా ఇది. ఈ టైటిల్‌తో ఓ సినిమా చేద్దామని చరణ్, సాయిధరమ్ తేజ్ ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఈ టైటిల్ వాడుకుంటే అంచనాలు పెరిగిపోతాయని భయపడ్డారు. కానీ… నాని మాత్రం ఎలాంటి భయం లేకుండా, ఈ పేరు పెట్టేశాడు. పాత సినిమాల టైటిళ్లంటే అంత మక్కువ దేనికో..?!