అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. కాంగ్రెస్ పార్టీలో ఎంత ఆభద్రతాభావం ఉందో.. ఎన్నికల్లో పోటీకి వెనుకడుగు వేస్తున్న సీనియర్ల తీరే చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోక్‌సభకు పోటీపై… పోటీ పడిన నేతలు.. ఇప్పుడు మాత్రం.. పోటీకి దూరం అనే ప్రకటనలు చేస్తున్నారు. లోక్‌సభ సీట్లకు దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్‌లిస్ట్ చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో.. చాలా మంది సీనియర్లు పోటీపై ఆసక్తి లేదని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినవారికి పార్లమెంట్ పోటీకి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ లెక్కన కోమటిరెడ్డి సహా.. అనేక మంది సీనియర్లు రేసు నుంచి వైదొలిగినట్లయింది.
నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ నియోజక వర్గాల టిక్కెట్లపై సీరియస్‌గా చర్చ సాగింది. మాజీ ఎంపీ మధుయాష్కీ పేరు నిజామాబాద్, భువనగిరి రెండు పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఉంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారో తేల్చుకోవాలని ఆయనకు సూచించారు. నిజామాబాద్ నుంచి మారోద్దని షబ్బీర్ అలీ సూచించారు. ఇక సీనియర్ నేత జైపాల్ రెడ్డి పోటీకి ఆసక్తి చూపకపోవడాన్ని మాజీ మంత్రి డీకే అరుణ తప్పుబట్టారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తప్పుకోవడం సరికాదని కమిటీ సమావేశంలో డీకే అరుణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతకు ముందు డీకే అరుణ… ఆ సీటు నుంచి పోటీ చేయాలన్న ఆసక్తి కనబరిచారు. తనకు కాకపోతే.. తన కుమార్తెకు అయినా ఇవ్వాలని పట్టుబట్టేవారు. జైపాల్ రెడ్డి.. నల్లగొండ నుంచి పోటీ చేయాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు… జైపాల్ రెడ్డి పోటీ చేయకపోవడాన్ని తప్పుపడుతున్నారు.
మొత్తానికి నియోజక వర్గానికి ఐదు పేర్ల చొప్పున జాబితాను సిద్ధం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి స్క్రీనింగ్ కమిటీ కి అప్పగించనున్నారు. ఇక పీసీసీ పని పూర్తి చేయడంతో స్క్రీనింగ్ ప్రక్రియను కూడా కంప్లీట్ చేసి ఈ నెలాఖరుకాల్లా కాంగ్రెస్ హైకమాండ్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశాలున్నట్లు రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఖరారు చేశారు .