వైఎస్ జగన్ గెలిస్తే.. అమరావతి రాజధానిని మార్చేస్తారు…! ఇది చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం. దీన్ని ఖండించేందుకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత కాలం పెద్దగా ప్రయత్నం చేయలేదు. పైగా.. మార్చడానికి తాము సుముఖమేనన్నట్లుగా.. అమరావతిపై… వైసీపీ నేతలు ఎక్కడా లేనంత వ్యతిరేక ప్రచారం చేశారు. ప్రత్యేకంగా మేధావుల పేరుతో కొంత మందిని రంగంలోకి దింపారు. పుస్తకాలు అచ్చు వేయించారు. కొంత మందికి చందాలిచ్చి.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లారు. వీటితో తమకు సంబంధం లేదని వైసీపీ నేతలు చెప్పుకోవచ్చు కానీ… రాజకీయాలపై ఏ కొద్దిగా అవగాహన ఉన్నవారికైనా దీని వెనుక ఉన్నది వైసీపీనేనని స్పష్టమవుతుంది. రాజధాని శంకుస్థాపనకు కూడా రాని.. జగన్మోహన్ రెడ్డి… ఒక వేళ ముఖ్యమంత్రి అయితే.. రాజధానిని మార్చేస్తారన్న ప్రచారం.. ఊపందుకుంటోంది. ఇది ప్రజల్లో అనేక అనుమాలు తలెత్తేలా చేస్తోంది. అందుకే.. దీనిపై వైసీపీ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
జగన్ గెలిచినా అమరావతే రాజధానిగా ఉంటుందని వైసీపీ నేతలు చెప్పడం ప్రారంభించారు. ఆ పార్టీ నేతలకు ఉన్న స్వాతంత్ర్యం ఇతర అంశాల ప్రకారం చూస్తే.. వారి మాటలను ఎవరూ నమ్మరు కాబట్టి… అదే అంశాన్ని మేనిఫెస్టో పెడతామంటూ.. చెప్పుకొస్తున్నారు. వైసీపీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడుగా ఉన్న.. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఒట్టు పెట్టి మరీ… అమరావతి రాజధానిగానే ఉంటుందని చెబుతున్నారు. మెరుగైన రాజధానిని నిర్మించడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన చెప్పుకొస్తున్నారు. అసలు రాజధానిగా అమరావతినే ఉంచుతామని చెప్పుకోవడం.. దానిపై నమ్మకం కలిగించేందుకు మేనిఫెస్టోలో కూడా చేరుస్తామని చెప్పడంలోనే… వైసీపీ విషయంలో ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయో.. ఆ పార్టీ నేతలకు కూడా క్లారిటీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిజానికి జగన్మోహన్ రెడ్డి.. గత ఎన్నికల్లో గెలిచి ఉంటే.. రాజధాని ఎక్కడ పెట్టి ఉండేవారో కానీ.. కడప జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో పద్ద ఎత్తున ఆయన బంధువులు భూములు కొనుగోలు చేశారు. కొన్ని భూముల విషయంలో.. గొడవలు కూడా జరిగాయి. అప్పట్నుంచి.. జగన్ వస్తారు.. రాజధాని మారుస్తారనే ప్రచారం.. ఉద్ధృతంగా సాగుతోంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడూ ఖండించలేదు. కచ్చితంగా అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పలేదు. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చిన ఇంటర్యూల్లోనూ.. జర్నలిస్టులు… రాజధాని మారుస్తారా.. అని ప్రశ్నిస్తే.. తాను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నానని సమాధానం ఇచ్చారు కానీ… అసలు జవాబు ఇవ్వలేదు. అందుకే.. అమరావతి విషయంలో వైసీపీ మాటలు కాస్త తేడాగానే ఉన్నాయి. అందుకే .. నమ్మించడానికి మేనిఫెస్టోలో కూడా పెడతామంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.