అధికారం తప్ప వేరే ధ్యాస లేదన్నట్టుగా కనిపిస్తోంది వైకాపా నేతల తీరు! తాను ముఖ్యమంత్రి అయితేనే సమస్యలు తీరుస్తా అంటూ దాదాపు ఏడాదిన్నరపాటు జగన్ పాదయాత్ర చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లాల్సిన కనీస బాధ్యతను కూడా ఆయన నిర్వర్తించలేదు. గడచిన నాలుగేళ్లూ హైదరాబాద్ లోనే ఉంటూ… ఇప్పుడు ఎన్నికలు దగ్గరకి వచ్చేసరికి ఆంధ్రాకి మకాం మార్చారు. దీన్ని కూడా ఏదో ప్రజాప్రయోజన కార్యక్రమంగా చెబుతున్నారు వైకాపా ఎమ్మెల్యే రోజా. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి కూడా శాశ్వత కార్యాలయం, ఇల్లు లేవన్నారు. ఒక్క వైకాపాకి మాత్రమే శాశ్వత నివాసాలున్నాయన్నారు. రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రిగా జగన్ ఇక్కడ ఆఫీసు, ఇల్లు కట్టారని రోజా అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లోకి ఎవ్వరికీ ప్రవేశం లేదనీ, ఇక్కడ దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారనీ, ఈరోజు వరకూ ఆయన ఇంటికి ఒక్క నాయకుడిని కూడా రానియ్యలేదని రోజా ఎద్దేవా చేశారు. కానీ, జగన్ ఇంట్లోకి అందర్నీ రానిస్తారనీ, తనని నమ్ముకున్నవారికి కుటుంబ సభ్యులుగా జగన్ భావిస్తారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే జగన్ రాజధాని ప్రాంతానికి నివాసం మార్చారన్నారు. కానీ, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసిన తరువాత కూడా ఇక్కడ పర్మనెంట్ ఇల్లుగానీ, ఆఫీస్ గానీ కట్టుకోలేదన్నారు. ముఖ్యమంత్రి రహస్య జీవితం గడుపుతున్నారన్నారు.
రోజా విమర్శలు ఎంత అర్థరహితంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ కొత్త ఇంట్లోకి వచ్చారంటున్నారు! గడచిన నాలుగేళ్లుగా ఆయన ప్రజలకు ఎందుకు అందుబాటులో లేరు..? ఆంధ్రాకి ఎందుకు నివాసం మార్చలేదు..? ఈ ప్రశ్నలకు సమాధానం ఏవి..? ఇంకోటి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకూ పర్మనెంట్ ఇల్లుగానీ, ఆఫీస్ గానీ లేదని రోజా ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన తరువాత… ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా ముందుగా ఆంధ్రాకి వచ్చింది ఎవరు, చంద్రబాబు నాయుడు కాదా..? సొంత ఇల్లు ఉందా, సౌకర్యవంతమైన ఆఫీస్ ఉందా, ఏసీ సరిగా పనిచేస్తోందా లేదా ఇలాంటివేవీ చూసుకోకుండా… పరిపాలన ఆంధ్రా నుంచే జరగాలని వచ్చిందెవరు.. చంద్రబాబు నాయుడు కాదా? అరకొర సౌకర్యాలున్నా సర్దుబాటు చేసుకుంటూ, పరిపాలన అందించింది ఎవరు..? సొంతగా విశాలమైన భవంతి నిర్మించుకుంటే తప్ప, ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి ఉండను అన్నట్టుగా ఇప్పుడు వ్యవహరించింది ఎవరు..? ఇంకోటి… ‘కాబోయే ముఖ్యమంత్రిగా జగన్ ఇల్లు కట్టుకోవడం’ అనడం మరీ విడ్డూరం. ప్రతిపక్ష నేతగా లేదా వైకాపా అధినేతగా అంటే తప్పేముంది..?