విశాఖ రైల్వే జోన్ ను కేంద్రం ప్రకటించింది. సౌత్ కోస్ట్ రైల్వేజోన్ గా పిలిచే ఈ జోన్ విజయవాడ , గుంటూరు, గుంతల్ డివిజన్లతో కలిపి ఉంటుంది. విభజన చట్టంలో ఉన్నప్పటికీ.. ఐదేళ్ల పాటు పరిశీలన జాబితాలోనే ఉంచిన కేంద్రం… ఎన్నికల నొటిఫికేషన్ రెండు, మూడు రోజుల్లో వస్తుందనగా.. రైల్వేజోన్ ను ప్రకటించారు. మార్చి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. విశాఖ పర్యటనకు రానున్నారు. అందుకే జోన్ ను ప్రకటించారు. దేనికోసమైనా.. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ స్వప్నం ఫలించిందన్న సంతృప్తి వ్యక్తమవుతోంది. విశాఖ రైల్వే జోన్ కోసం ఏపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. 29సార్లు ఢిల్లీ వెళ్లి వ్యక్తిగతంగా కలిసి వినతులు అందించారు. ప్రధానికి, రైల్వేమంత్రికి అనేక లేఖలు రాశారు. సాక్షాత్తూ రైల్వే మంత్రికి మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించారు. అయినా రాజకీయ లాభం కోసం… వేచి చూసి చూసి.. ఎన్నికల ముందు ప్రకటించారు.
విశాఖ రైల్వేజోన్ డిమాండ్ ఇవాళ్టిది కాదు. విశాఖకు ప్రత్యేకంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని ప్రజలు అనేక ఆందోళనలు జరిపారు, నిరసనలు తెలిపారు.
ఏపిలో 3 డివిజన్లు సికింద్రాబాద్ రైల్వేజోన్‌లో ఉండగా, వాల్టేర్ డివిజన్ భువనేశ్వర్ రైల్వే జోన్లో ఉంది. ఏపిలో ఉన్న 4 డివిజన్లు కలిపి విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలనేది ఈ ప్రాంత ప్రజల డిమాండ్. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న 3 డివిజన్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న వాల్టేర్ డివిజన్ కలిపి నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే… వాల్తేర్ డివిజన్ ను తొలగించి మిగిలిన మూడు డివిజన్లతోనే జోన్ ప్రకటించారు. అయితే ఏపీలో ఉన్న రైల్వే భాగాన్నంతా జోన్ లో కలిపే అవకాశం ఉంది.
రైల్వేజోన్‌కు కావాల్సిన అన్నిరకాల విద్య, వైద్య, క్రీడా వసతులు, మౌలిక సదుపాయాలు విశాఖలో పుష్కలంగా ఉన్నాయి. విశాఖపట్నానికి రెండు భారీ ఓడరేవులు ఉండటం సహజసిద్ధంగా కలిసివచ్చే అంశం. విశాఖ రైల్వే స్టేషన్ వద్ద 800 ఎకరాల భూమి జోన్ ఏర్పాటుకు అందుబాటులో సిద్ధంగా ఉంది. వాల్టేర్ డివిజన్‌కు అతిపెద్ద లోకో షెడ్, అద్భుతమైన కోచ్ మెయింటెనెన్స్ డిపో ఉన్నాయి. జోన్ ఏర్పాటును రైల్వే మంత్రి అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక వ్యవహారాలు త్వరలోనే పూర్తి చేస్తామని పీయూష్ గోయల్ ప్రకటించారు.