“స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరిపి.. సమగ్ర అధ్యయనం చేసి రైల్వేజోన్ ప్రకటిస్తున్నాం..” రైల్వే మంత్రి పియూష్ గోయల్ చేసిన ప్రకటన ఇది. రెండు రోజుల్లో ఎన్నికల ప్రకటన వచ్చే ముందు మాత్రమే… కేంద్రం సంప్రదింపులు, చర్చలు పూర్తయ్యాయని మనం అనుకోవాలి. మోడీ పర్యటనకు నిరసనలు ఎదురు కాకుండా ప్రజలకు ఓ తాయిలం ఇవ్వడానికి రైల్వేజోన్‌ను ఇస్తున్నట్లు ప్రకటించారనే.. విషయం రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరికైనా అర్థం అవుతుది. ఎవరితో సంప్రదింపులు జరిపారు..? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో.. ఒక్క మాట అయినా.. రైల్వేజోన్ గురించి చర్చించారా..? . ఒడిషా ప్రభుత్వంతో మాట్లాడారా..?.
నిజానికి రైల్వేజోన్ ప్రకటిస్తారన్న ఆశతో.. తెలుగుదేశం పార్టీ బీజేపీకి రాజకీయ పదవులను కూడా ఇచ్చింది. ఓ సారి నిర్మలా సీతారామన్‌ను… రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపింది. మరోసారి.. రైల్వే మంత్రిగా ఉన్న సురేష్ ప్రభును చూపించి… ఆయన రైల్వోజోన్ ప్రకటిస్తారు.. మీ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపమని.. బీజేపీ హైకమాండ్.. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడంతో.. రైల్వే జోన్ ముందు… రాజ్యసభ పదవి ఎంత అని.. సొంత పార్టీ నేతలకు నచ్చ చెప్పి ఆ పదవీ అప్పగించారు. ఆ తర్వాత రెండు, మూడు సందర్భాల్లో… రైల్వేజోన్ ను.. సురేష్ ప్రభు ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఓ సారి విశాఖలో ఆయన రైల్వేజోన్ ప్రకటన చేయడానికి సిద్ధమై వచ్చారు. మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఆ సమావేశంలో జోన్ మినహా మిగిలిన విషయాలపై మాట్లాడి వెళ్లిపోయారు. దానికి కారణం… అమిత్ షా నుంచి వచ్చిన ఆదేశాలు. ఏపీకి ఇప్పుడు జోన్ ఇచ్చినా ఇవ్వకపోయినా… పోయేదేం లేదని.. ఆదేశించడంతో.. వచ్చిన పని కాకుండా… ఇంకెదో చెప్పి వెళ్లిపోయారు సురేష్ ప్రభు. ఆ తర్వాత వరుస రైలు ప్రమాదాల సాకు చూపి ఆయనను రైల్వే మంత్రి పదవి నుంచి ఊడబికారు. అలా.. ఏపీ రాజ్యసభ సభ్యత్వం బీజేపీ పాలయింది.
ఎన్నికలకు రెండు రోజుల ముందు.. కేవలం విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అంత సుదీర్ఘమైన కసరత్తు చేస్తే.. ఏర్పాటు ప్రక్రియను కూడా ప్రారంభించి ఉండేవారు. కానీ.. జోన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత కనీసం .. ఏడాది సమయం పడుతుందని.. రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేసుకుని.. జోన్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నిర్ణయం ఏదో.. ఏడాది కిందట తీసుకుని ఉంటే.. ఇప్పుడు జోన్ కల సాకారం అయి ఉండేది. కానీ ఓట్ల తూకంలో.. జోన్ ను చూసుకుని… కేంద్రం ఏపీని మరోసారి వంచించింది.