వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు పార్లమెంట్‌కే కాదు.. ఇటు అసెంబ్లీ అభ్యర్థుల సమస్యను ఎదుర్కొంటోంది. టిక్కెట్ కోసం చాలా మంది వస్తున్నప్పటికీ.. వారిలో .. గట్టి పోటీ ఇచ్చే నేతలే.. వైసీపీ నేతలకు కనిపించడం లేదు. అన్ని రకాల సర్వేలతో… అభ్యర్థుల పరిస్థితిని అంచనా వేస్తున్న పీకే బృందానికి.. టీడీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలే బలంగా కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెలకొకరిని మారుస్తూ మెజార్టీ నియోజవర్గాల్లో సమన్వయకర్తలకు నిద్ర లేకుండా చేస్తున్న పీకే టీం.. టీడీపీ నేతలకు గాలం వేయాలని వైఎస్ జగన్ కు సూచించింది. చంద్రబాబు టిక్కెట్లు ఖరారు చేస్తున్న సమయంలో.. అసంతృప్తుల్ని.. లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అభ్యర్థుల ఖరారు ఉంటుందని… వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి వైఎస్ జగన్.. అభ్యర్థుల ప్రకటన విషయంలో తన తండ్రిని ఫాలో అవ్వాలనుకున్నారు. ఓ జాబితాను రెడీ చేసుకుని పాదయాత్ర ముగింపు సభలో ప్రకటించాలనుకున్నారు. కానీ.. ప్రశాంత్ కిషోర్ నిలిపివేయించారు. తెలుగుదేశంలో ఉన్న అసంతృప్తులు, సీటు రాని వారిపై వల విసరాలని, దీని వల్ల తెలుగుదేశాన్ని ఎన్నికలకు ముందు క్యాడర్ ను, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని నైతికంగా దెబ్బ తీయవచ్చని సలహా ఇచ్చారు. ఆ ప్రకారం.. టిక్కెట్ రాని టీడీపీ నేతలపై వైసీపీ నేతలు గురి పెట్టారు. ఆ ప్రభావం వల్లే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైసీపీలో చేరిపోయారు. మిగిలిన వారి పేర్లు ప్రచారంలోకి వస్తున్నా… వైసీపీ నేతల అత్యుత్సాహం చూసి.. వారు.. అలవి కాని డిమాండ్లు పెడుతున్నారు. దాంతో.. వైసీపీకి ఇదో కొత్త తలనొప్పిలా మారిపోయింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షలో మెజార్టీ నేతలకు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అవినీతి ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారి పట్ల మాత్రం ఆయన పెండింగ్ లో ఉంచుతున్నారు. చంద్రబాబు ప్రకటన అనంతరం కొంతమంది నేతలు తమ వైపుకు వస్తారని వైసీపీ ఆశిస్తోంది. అయితే సామాజికవర్గ సమీకరణాల పేరుతో… ముఖ్య నేతల్ని కూడా.. జగన్ నియోజకవర్గాలు మారాలని సూచిస్తూండటంతో.. చాలా మంది సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారని.. వారు రేపోమాపో పార్టీలో చేరి జగన్‌కు షాకిస్తారని చెబుతున్నారు.