ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో .. ఏ పార్టీలో లేని నేతలు… ఏదో ఓ పార్టీలో చేరి అవకాశం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిలో దాడి వీరభద్రరావు ఒకరు. ఆయన వైసీపీకి రాజీనామా చేసినా.. వైఎస్ జగన్ను చెడామడా తిట్టేసి చాలా కాలం అయింది. కానీ ఏ పార్టీలో చేరలేకపోయారు. టీడీపీ అధినేత ఆహ్వానిస్తే.. చేరిపోతానని.. గతంలో చాలా సార్లు ప్రకటించారు. కానీ చంద్రబాబు ఆహ్వానించలేదు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావుతో ఉన్న స్నేహంతో.. ఆయనతో లాబీయింగ్ చేసుకుని టీడీపీలో చేరాలని తీవ్రంగా ప్రయత్నించారు. కళా వెంకటరావు పలుమార్లు ఈ విషయంపై చంద్రబాబుతో చర్చించారు. కానీ.. విశాఖ విషయంలో చంద్రబాబు ఎదుట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే.. ఏ విషయాన్ని తేల్చి చెప్పలేదు.
కొణతాల రామకృష్ణ… టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబుతో సమావేశమవుతున్నారు. ఆ తర్వాత పార్టీలో చేరిక తేదీని ప్రకటించే అవకాశం ఉంది. కొణతాల, దాడి వీరభద్రరావు ఇద్దరూ.. అనకాపల్లి కేంద్రంగా రాజకీయాలు చేసిన వారే. దాడి టీడీపీలో ఉంటే.. కొణతాల కాంగ్రెస్లో ఉండేవారు. గత ఎన్నికల సమయంలో ఇద్దరూ వైసీపీలో ఉన్నారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ వైసీపీకి దూరమయ్యారు. ఇద్దరూ టీడీపీ వైపు చూసినా.. టీడీపీ హైకమాండ్ మాత్రం.. కొణతాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీంతో టీడీపీపై ఒత్తిడి పెంచడానికి తాను వైసీపీ వైపు చూస్తున్నట్లుగా.. దాడి వీరభద్రరరావు… సూచనలు పంపుతున్నారు. తనకు వైసీపీ నేతలు టచ్లో ఉన్నారని చెబుతున్నారు.
కానీ పార్టీకి గుడ్ బై చెప్పేటప్పుడు.. దాడి వీరభద్రరావు చేసిన ఆరోపణలు గుర్తుంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను మరోసారి పార్టీలోకి తీసుకుటారని ఎవరూ అనుకోరు. జగన్ తత్వం తెలిసిన వారు దాడిని వైసీపీలోకి తీసుకోరని చెబుతున్నారు. నిజానికి దాడి ఇంటికి వెళ్లి పవన్ కల్యాణ్ జనసేనలో చేరాలని ఆహ్వానించారు. అనుచరులతో మాట్లాడి చెబుతానని దాడి వీరభద్రరావు పవన్ కు చెప్పారు. ఆ తర్వాత సైలెంటయిపోయారు. కానీ పవన్ కల్యాణ్ రాజకీయం సీరియస్గా లేదని.. ఆయన పార్టీని ప్రజలు పరిగణనలోకి తీసుకోరన్న భావనలో దాడి వీరభద్రరావు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే.. అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లు ఉన్నారంటున్నారు. మరి ఈ విషయంలో ఆయన రాజకీయ పయనం ఎటు వైపు ఉంటుందో మరి..!