జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి తండ్రి.. నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్పాండ్ లో ఉన్న జగన్ నివాసంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎంగా గెలిపించుకోవడం కోసమే వైసీపీలో చేరినట్లు నార్నె శ్రీనివాసరావు చెప్పారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆయన.. చాలా తక్కువ మందికి పరిచయం కానీ.. జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామగా.. మాత్రం అందరికీ పరిచయమే. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు సమీప బంధువు కూడా.
చాలా కాలంగా.. నార్నె.. శ్రీనివాసరావుకు రాజకీయ ఆశలు ఉన్నాయి. గుంటూరు జిల్లా చిలుకలరి పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది.. నార్నె శ్రీనివాసరావు జీవిత లక్ష్యం. చంద్రబాబుకు సమీప బంధువు కావడంతో.. గతంలో.. టీడీపీలోనే ఉండేవారు. అప్పట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విపరీతంగా సంపాదించడంతో.. చిలుకలూరిపేటలో కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి … రాజకీయంగా అదృష్టం పరీక్షించుకుందామని అనుకున్నారు. కానీ చంద్రబాబు చాన్సివ్వలేదు. జూనియర్ ఎన్టీఆర్ , ప్రణతి వివాహం తర్వాత .. అనూహ్యంగా.. చంద్రబాబు కుటుంబంతో విబేధాలొచ్చాయి. అప్పట్నుంచి ఆయన రాజకీయంగా తెర వెనక్కు వెళ్లిపోయారు.
గత ఎన్నికలకు ముందు కూడా.. నార్నె శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. కానీ అప్పుడు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో.. ఆయన వైసీపీలో చేరలేదని చెబుతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్… చిలుకలూరిపేటలో సర్వే నిర్వహించి… సామాజిక సమీకరణాలు లెక్కలేసుకుని… నార్నె శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇస్తే మంచిదని అంచనాకు వచ్చినట్లు.. ఈ మేరకు జగన్కు సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే… మళ్లీ పిలిచి మరీ.. నార్నెకు కండువా కప్పారని అంటున్నారు. ఇప్పటికే… చిలుకలూరిపేటలో మర్రి రాజశేఖర్ అనే సీనియర్ నేత పార్టీకి ఉన్నారు. ఆయితే ఆయనను కొంత కాలం కిందట తప్పించి.. విడదల రజనీ అనే ఎన్నారైకి సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చారు. ఆమె కొంత కాలంగా విపరీతంగా ఖర్చు పెడుతూ ప్రచారం చేసుకుంటోంది. ఇప్పుడు జగన్ ఆమె స్థానంలో నార్నెను తీసుకుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.