రైల్వేజోన్ ప్రకటన భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం కలసి వచ్చేలా లేదు. పైగా.. వాల్తేర్ డివిజన్ ఆదాయాన్ని కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు చేసి.. దానికి తరలించడం.. ఆంధ్రప్రదేశ్ లో విస్త్రతంగా చర్చకు కారణం అవుతోంది. బీజేపీ మరోసారి మోసం చేసిందన్న భావన అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. పీయూష్ గోయల్ రైల్వేజోన్ ప్రకటన చేసిన తర్వాత అందరూ ఆహ్వానించారు. కానీ అందులోలొసులుగు బయటపడిన మాత్రం మాత్రం ఖండించడం ప్రారంభించారు. విశాఖలో రైల్వే జోన్ ప్రకటనపై వివిధ పార్టీలు సంఘాలు… సమావేశమయ్యాయి. వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన, లోక్‌సత్తా, రైల్వే జోన్ సాధన సమితి, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం .. ఇలా అన్ని సంఘాలు సమావేశమై.. రైల్వే జోన్ పై చర్చించి అసంతృప్తి వ్యక్తం చేశాయి . ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే
జోన్ ప్రకటన చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఏపీ ప్రభుత్వం తరపున చంద్రబాబు రైల్వేజోన్ ప్రకటనలోని డొల్లతనాన్ని బయటపెట్టారు.
రైల్వేజోన్ పేరుతో మాయజోన్ ప్రకటించారని విమర్శించారు. వాల్తేరు డివిజన్‌ని పక్క రాష్ట్రానికి ఇచ్చి ఏపీకి అన్యాయం చేశారుని మండిపడ్డారు. ఇప్పుడు వచ్చే ఆదాయం మొత్తం ఒడిశాకే వెళ్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రానీయకుండా కుట్రలు చేస్తున్నారుని విమర్శించారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు కూడా లేకుండా చేశారని మోసపూరితమైన రైల్వే జోన్ మాకు వద్దు.. విశాఖ జోన్ కావాలని స్పష్టం చేశారు. రైల్వేజోన్ ప్రకటించగానే వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడంపై లోకేష్ ట్విట్టర్లో సెటైర్లు వేసారు. జగన్ ఏపీలో అడుగుపెట్టగానే రైల్వేజోన్ వచ్చింది అని.. వైసీపీ నేతలు స్వీట్లు పంచుకుని.. జగన్ గృహప్రవేశానికి మోదీ రైల్వేజోన్ కానుకగా ఇచ్చారని.. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. కానీ ఏడాదికి రూ.6,500 కోట్లు ఆదాయం తెచ్చే వాల్తేరు డివిజన్‌ని.. ఒడిశాకి మోదీ కానుకగా ఇచ్చి రాష్ట్రానికి అన్యాయం చేశారని.. మోడీతో జతకట్టి రైల్వేజోన్ కుట్రలో..జగన్ భాగస్వామ్యం అయ్యారని తేలిపోయిందని ఆరోపించారు.
రైల్వే జోన్ ప్రకటిస్తే ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందనుకున్న భారతీయ జనతా పార్టీ నేతలకు పరిస్థితి రివర్స్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా సహా పలువురు విశాఖ రైల్వే స్టేషన్ కు వెళ్లి సంబరాలు చేసుకున్నా… ఎవరూ పట్టించుకోలేదు. ప్రజాకోరిక మేరకు రైల్వేజోన్ ప్రకటన చేశారు, పార్టీల తీరు శోచనీయమని పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోసమని కొన్ని పార్టీలు చెబుతున్నాయి, కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.