కాకినాడకు చెందిన వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. గన్నవరంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగే కార్యక్రమంలో చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థి అవుతారనుకున్న చలమలశెట్టి సునీల్.. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. చలమలశెట్టి సునీల్ 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు 2009లోనూ.. పీఆర్పీ అభ్యర్థిగా అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండు సార్లు కూడా .. స్వల్ప తేడాతోనే ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వతా వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నా… జగన్ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. రాజ్యసభ ఎన్నికలకు ముదే టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. మూడో అభ్యర్థిగా సునీల్‌ను నిలబెడతారని చెప్పుకున్నారు.
కానీ అప్పట్లో మూడో అభ్యర్థిని టీడీపీ నిలబెట్టలేదు. ప్రస్తుత కాకినాడ ఎంపీ తోట నరసింహం.. ఈ సారి పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దాంతో సునీల్‌కు మార్గం సుగమం అయింది. వైసీపీ కాకినాడ లోక్‌సభ కోఆర్డినేటర్‌గా ఉన్న చలమలశెట్టి సునీల్.. జిల్లా రాజకీయాలలో ప్రాధాన్యం ఉన్న సామాజిక వర్గం. పార్టీలకు అతీతంగా సునీల్‌కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పారిశ్రామిక కుటుంబానికి చెందిన సునీల్‌కి ఈ జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో మంచి పట్టుంది. రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి కూడా కనిపిస్తోంది. తన సామాజికవర్గనికి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి… ప్రాధాన్యం ఇస్తూ.. జిల్లాను ఆయనకు రాసిచ్చినట్లు వ్యవహరించడంతో.. అనేక మంది వైసీపీ నేతలు.. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. ముందు నుంచీ వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జగన్‌తో ఆయనకు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. దాంతో ద్వారంపూడిని కాదని సునీల్‌కు ప్రాధాన్యత ఇవ్వక.. ఆయనను వదులుకున్నారు. వారిలో కొంత మంది జనసేనలో కూడా చేరిపోయారు. సునీల్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆయన జగన్ పాదయాత్రకు కూడా దూరంగా ఉన్నారు. సునీల్‌ను పార్టీలోనే ఉంచేందుకు జగన్ పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఓ బలమైన అభ్యర్థిని కోల్పోయినట్లయింది.