రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకుంటున్నారని… తూర్పుగోదావరి జిల్లా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ల ఖరారు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు.. రాజమండ్రి నియోజకవర్గ పార్లమెంటరీ సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలోనే.. ఆయన పోటీకి దూరంగా ఉండాలనే తన నిర్ణయాన్ని చెప్పబోతున్నారని సమాచారం. అంతే కాదు.. తన కోడలు రూపకు కూడా టిక్కెట్ వద్దని.. తమ కుటుంబం ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆయన నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
మురళీమోహన్‌కు బదులుగా.. ఈ సారి ఆమె కోడలు రూపకు టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ఎంపీగా… మురళీమోహన్ ఢిల్లీ వ్యవహారాలు చక్క బెడుతూంటే.. నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం కోసం.. ఆయన కోడలు రూపనే ఎక్కువగా ప్రయత్నించేవారు. టీడీపీలో ఆమెకు ఓ పదవి కూడా ఉంది. ఆమె అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు కృష్ణా జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పరిశీలించారు. అయితే అనూహ్యంగా మురళీమోహన్ రాజకీయల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. తన ట్రస్ట్ వ్యవహారాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని ఆయన కారణంగా చెబుతున్నారు.
అయితే.. టీడీపీ నేతలు మాత్రం.. మరో విశ్లేషణ చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని మురళీమోహన్ ఎప్పుడో నిర్ణయించుకున్నారని… కోడలు రూపకు సామాజిక సేవపై ఆసక్తి ఉండటం, రాజకీయ అవగాహన ఉండటంతో.. ఆమెను ప్రమోట్ చేయాలనుకున్నారు. అందుకే.. తన బదులుగా రాజమండ్రిలో పార్టీ వ్యవహారాలు చూసుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు రాకుండా… రాజకీయ వైరాగ్యం ప్రకటిస్తున్నారని.. తూర్పుగోదావరి జిల్లా నేతలతోనే.. రూప పేరును ప్రతిపాదించేలా చేస్తారని.. చెబుతున్నారు. ఏం జరగనుందో… సాయంత్రం తేలిపోయే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి రూపకే ఎక్కువ అవకాశం అని టీడీపీ వర్గాలు ఇప్పటికే చెబుతున్నాయి.