వైకాపాలో ఈ మధ్య కొంతమంది నేతలను పక్కనపెడుతున్న తీరు కనిపిస్తోంది. అయితే, ఇదంతా పార్టీ అధ్యక్షుడు జగన్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల్లో భాగమే అంటూ వైకాపా వర్గాలు సమర్థించుకుంటున్నాయి. గత ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామనీ, ఈసారి ఎక్కడా ఎలాంటి తప్పులూ జరగకూడదనీ, మరీ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ ఈసారి చాలా జాగ్రత్తగా ఉంటున్నారని అంటున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయమై ఇప్పటికే సర్వేల ద్వారా అభిప్రాయాలు తెప్పించుకుంటున్నారు. ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల జాబితా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, ఈసారి సీట్ల కేటాయింపుల విషయంలో బంధువులు, స్నేహితుల్లాంటి ఎలాంటి సిఫార్సులకీ జగన్ ఆస్కారం ఇవ్వరనీ, గెలిచేవారిని మాత్రమే ఎంపిక చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే, బాబాయ్ అలిగినా, సన్నిహితులు దూరమౌతున్నా ఆయన పట్టించుకోవడం లేదనేది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న విశ్లేషణ.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వాస్తవిక దృక్పథంతో చేయడం మంచిదే. అయితే, ఈ క్రమంలో పార్టీకి ఎప్పట్నుంచో వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నవారిని జగన్ దూరం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వంగవీటి రాధ అంశం దగ్గర్నుంచీ చూసుకుంటే… టిక్కెట్ కోసం ఆయన పార్టీమీద ఒత్తిడి తెచ్చినా, జగన్ తన నిర్ణయం మార్చుకోలేదు. అంతిమంగా ఆయన పార్టీని వదలి వెళ్లారు. పాణ్యం నియోజక వర్గంలో ఎమ్మెల్యే గౌరు చరితకు కూడా ఈసారి అవకాశం ఉండదని ముందే సంకేతాలు ఇచ్చారు. అక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డికి టిక్కెట్ ఖరారు చేయడంతో… గౌరు కుటుంబం టీడీపీలోకి వెళ్తోంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇక, బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అంశం కూడా ఇప్పుడు పార్టీలో చర్చనీయంగానే ఉంది. ఆయనకీ టిక్కెట్ కాదనడంతో సుబ్బారెడ్డి కుటుంబం అలకబూనింది.
అభ్యర్థుల ఎంపికలో జగన్ కఠినంగా వ్యవహరిస్తున్నారని వైకాపా చెప్పుకుంటున్నా… ఇంకోపక్క, అసంతృప్తులను స్వయంగా పెంచుకుంటున్నట్టుగా ఉంది. జగన్ అంచనాల ప్రకారమే పార్టీలో ఉన్న ప్రముఖులు కొందరు గెలవరనే సమాచారం ఉన్నా, వారికి టిక్కెట్లు ఇవ్వొద్దనుకుంటున్నప్పుడు… వారిని మరోలా డీల్ చెయ్యాలి. వారు అసంతృప్తికి గురి కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పార్టీని వదిలి వెళ్లే పరిస్థితికి ఆస్కారం ఇవ్వకూడదు. దాని వల్ల అంతిమంగా పార్టీకే నష్టం కలిగే పరిస్థితి. గెలుపు కోసం సొంతవారిని కూడా పక్కనపెడుతున్నారని వైకాపా చెబుతున్నా… ఆ సొంతవారిలో అసంతృప్తి బయటకి రాకుండా చూసుకోవడం జగన్ విఫమౌతున్నారనే చెప్పాలి.