పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు మళ్లీ వైకాపాలో చేరిన లాంఛనం పూర్తయింది. ఇంతకీ ఆయన పార్టీ ఎందుకు మారారంటే… ప్రజలు మారమన్నారని చెప్పారు! వైకాపా కండువా వేసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… గత ఆరునెలలుగా తాను ప్రజల్లో ఉంటున్నాననీ, ప్రజాస్వామ్యంలో ప్రజలతోపాటే నాయకులు ఉండాలన్నారు. ఏ రాజకీయ పార్టీతో తాను ప్రయాణించాలనే సూచనల్ని తన ప్రజలు ప్రేమగా ఇచ్చారనీ, రాష్ట్ర ప్రజల మెజారిటీ అభిప్రాయం వైకాపా వైపే ఉందన్నారు! రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమౌతుందని తటస్థ ఓటర్లు కూడా అభిప్రాయపడుతున్నారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. కేంద్రంతో పోరాడి ఏ హామీలనైనా అమలు చేసుకోగల సామర్థ్యం జగన్ ఉందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.
కుటుంబమన్నాక చిన్నచిన్న అపోహలు వస్తుంటాయనీ, కొంతమంది ప్రభావం వల్ల కూడా అలాంటి వస్తాయనీ, అలాగే తమ మధ్య చిన్న అభిప్రాయభేదాలు వచ్చాయన్నారు. ఇప్పుడు అవన్నీ సరైపోయాయనీ, ఇప్పుడు ఎలాంటి అభిప్రాయ భేదాలూ లేవన్నారు. జగన్ తోపాటు విజయసాయి రెడ్డి నాయకత్వంలో తాను పనిచేస్తా అన్నారు. తాను రెండే పార్టీలు మారాననీ, వైసీపీ నుంచి వైసీపీకి వచ్చిన క్రమంలో మధ్యలో ఒకే పార్టీ ఉందన్నారు రఘురామకృష్ణ. టీడీపీ, బీజేపీ కలిసే ఉన్నప్పుడు అది ఒక్క పార్టీ అవుతుంది కదా అన్నారు.
వాస్తవానికి, రఘురామకృష్ణంరాజు మళ్లీ వైకాపాకి ఎందుకొచ్చారో అందరికీ తెలిసిందే. ఆయనకు ఎంపీ సీటు కావాలి! టీడీపీ నుంచి కాస్త అనుమానం వ్యక్తం కాగానే… ఆసల్యం చేస్తే వేరే చోట కూడా అవకాశం దక్కదేమో అనే ఉద్దేశంతో ఆయన వెంటనే వైకాపాకి వచ్చేశారు. అలాంటప్పుడు, ‘ఇది ప్రజలు కోరుకున్న మార్పు, ప్రజాభిప్రాయం గౌరవించి తీసుకున్న నిర్ణయం’ అని చెప్పడమే హాస్యాస్పదంగా ఉంది! ఏ నాయకుడినీ పార్టీ మారాల అంటూ ప్రజలు ఎక్కడైనా కోరతారా..? సరిగ్గా పనిచేయమంటారు, చెయ్యకపోతే తరువాతి ఎన్నికల్లో ఓట్లేయడం మానేస్తారు, అంతే. ఎన్నికల సమయంలో నాయకులు పార్టీలు మారేది ప్రజల కోసం అని చెప్పడమే పెద్ద కామెడీ!
సరిగ్గా ఓవారం రోజుల కిందట, ఇదే రఘురామకృష్ణంరాజు ఏమన్నారూ… రానున్న ఎన్నికల్లో టీడీపీదే విజయమన్నారు. భారీ మెజారిటీలో టీడీపీ అధికారంలోకి రాబోతోందన్నారు. ఏపీకి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయకత్వం వల్ల మాత్రమే సాధ్యమన్నారు. అంటే… వారం కిందట ఈ మాటలు చెబుతున్నప్పుడు ప్రజలందరూ ఆయన్ని ‘అయ్యా… మీరు టీడీపీలోనే ఉండండయ్యా’ అన్నారా..? ఇప్పుడేమో జగన్ నాయకత్వంలోనే అభివృద్ధి అంటున్నారు! అంటే, వారంలోపుగానే ప్రజలందరూ అభిప్రాయం మార్చేసుకున్నారా..? ఆ ప్రజలంతా రఘురామకృష్ణం రాజు దగ్గరవెళ్లి… ‘తూచ్… జగన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందయ్యా, గతవారం ఏదో తెలియక అనేశామయ్యా, ఇప్పుడు పార్టీ మారిపోండయ్యా’ అని బతిమాలారా..? ఏమో.. పార్టీ మారడానికి ఆయన చెబుతున్న కారణాలు వింటుంటే ఇలానే జరిగిందేమో అనిపిస్తోంది!!!