తెలుగుదేశం పార్టీలో ఈ సారి వారసలు హవా కనిపిస్తోంది. తాము సైడ్ తీసుకుంటామని కొంత మంది.. తమతో పాటు.. తమ వారసులకు అవకాశం ఇవ్వాలని మరికొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వారసుల జాబితా.. నేరుగా.. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబం నుంచే ప్రారంభమవుతోంది. ఆయన కుమారుడు లోకేష్ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. అక్కడ్నుంచి ప్రారంభించి.. దాదాపుగా టీడీపీ ప్రారంభం నుంచి ప్రతి సీనియర్ నేత.. తమ కుటుంబంలో మరో టిక్కెట్ కోరుతున్నారు. రాయలసీమలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు ఈ సారి బరిలో నిలువనున్నారు. వయోభారం కారణంగా.. కేఈ కృష్ణమూర్తి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన తనయుడు కేఈ శ్యాంబాబుకు పత్తికొండ టిక్కెట్ ఖరారయింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో ఉన్నారు. తండ్రి స్థానంలో ఈసారి తాను పోటీ చేయాలని కుమారుడు సుధీర్‌రెడ్డి ఆసక్తితో ఉన్నారు. చంద్రబాబు ఇంకా ఖరారు చేయలేదు. నగరిలో దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి పెద్దకుమారుడు భాను టిక్కెట్ ఆశిస్తున్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న పట్టుదలతో ఉన్నారు. సునీత ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తనకు మరో నియోజకవర్గంలో అవకాశం ఇవ్వాలని శ్రీరాం కోరుతున్నా రు. కల్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమంతరాయ చౌదరి వయోభారంతో ఉన్నారు. అక్కడ ఆయన కుమారుడు టిక్కెట్ అడుగుతున్నారు. అనంతపురం జిల్లాలోనే జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఈ సారి ఎన్నికల్లో పోట చేయడం లేదు. ఎంపీగా దివాకరరెడ్డి కుమారుడు పవన్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి బరిలోకి దింపాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. దీనికి టీడీపీ అధినేత కూడా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.కర్నూలు జిల్లాలో రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ తనయుడు భరత్ కర్నూలు అసెంబ్లీ సీటు కోసం ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రకాశం జిల్లాలో కరణం బలరాం కుమారుడు.. గత ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే.. ఈ సారి సీటు సమస్య వచ్చింది. బలరాం కుమారుడి పేరు చీరాల నియోజకవర్గం నుంచి వినిపిస్తోంది. కానీ ఈ సారి బలరాం పేరునే ఖరారు చేశారని చెబుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ కుమారుడు రంగారావు అసెంబ్లీ టిక్కెట్ అడుగుతున్నారు. దివంగత టీడీపీ సీనియర్ నేత లాల్‌జాన్ బాషా కుటుంబ సభ్యులు కూడా ఈసారి పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం కూడా పోటీకి ఆసక్తితో ఉన్నారు. ఆ జిల్లాలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లితోపాటు గతంలో ప్రాతినిధ్యం వహించిన నరసరావుపేట అసెంబ్లీ సీటు వ్యవహారాలు కూడా కోడెలే చూస్తున్నారు. ఈ రెంటిలో ఒక చోట ఆయన మరోసారి పోటీ చేయనున్నారు. రెండో చోట అవకాశం వస్తుందని శివరాం అనుకుంటున్నారు దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్ గుడివాడలో.. కొడాలి నానిపై పోటీకి సిద్ధమవుతున్నారు.
గోదావరి జిల్లాల్లోనూ.. వారసుల హవా ఎక్కువే ఉండనుంది. అమలాపురం లోక్ సభ అభ్యర్థిగా ఈ సారి లోక్‌సభ మాజీ స్పీకర్ దివంగత బాలయోగి కుమారుడు హరీశ్ పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు వరపుల సుబ్బారావు వారసుడు వరుపుల రాజా, జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ కూడా.. పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కానీ వీరిలో వరుపుల రాజాకు మాత్రమే చంద్రబాబు చాన్సిస్తారని అంటున్నారు. అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కూడా ఈసారి పోటీ చేయాలని బాగా ఆసక్తితో ఉన్నారు. అయ్యన్నపాత్రుడు మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అనకాపల్లి ఎంపీ సీటులో అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కానీ..విశాఖలో ఉన్న పరిస్థితి చూస్తే కష్టమేనంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర్ శివాజీ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ముందే చెప్పేశారు. ఈ సారి పలాసలో ఆయన శిరీష బరిలో ఉండనున్నారు . నందమూరి బాలకృష్ణ కుటుంబం రెండో అల్లుడు భరత్ …. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తికి మనవడు. విశాఖ ఎంపీ సీటుకు ఆయన పేరు ప్రచారంలో ఉంది.