“నాకు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు లేవు.. నన్ను ఎవరూ బెదిరించలేదు.. నాకు నేనుగానే వైసీపీలో చేరాను..” ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన… రఘురామకృష్ణంరాజు.. మీడియాకు ముందుగా చెప్పిన మాట. కొంత కాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఆస్తులు, వ్యాపారాలున్న వారిని బెదిరించి.. వైసీపీలో చేర్పిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కౌంటర్‌గా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కానీ.. ఆయన వ్యాపారాలకు హైదరాబాదే కేంద్రం. కానీ చేసేది మాత్రం ఇతర రాష్ట్రాల్లో. అక్కడ ఆయన చేసిన ఘనకార్యాలు పెద్దగా బయటకు రాలేదు కానీ… వివిధ సంస్థల పేరుతో దాదాపుగా రూ. 3వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారు. వీటినే ఆయువు పట్టుగా.. పట్టుకున్న బీజే్పీ నేతలు.. బలవంతంగా.. వైసీపీలో చేర్పించారనే ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ బిల్డింగ్ ఎదురుగానే… ఇండ్-భారత్ కంపెనీ కార్యాలయం ఉంటుంది. ఎప్పుడూ పెద్దగా ఉద్యోగులు.. ఇతర సందడి పెద్దగా కనిపించదు. ఈ కంపెనీకి.. చాలా ఘన చరిత్ర ఉంది. ఎలాంటిదంటే.. వివిధ రుణ సంస్థల నుంచి రూ. 3వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టేసింది. దీనికి చైర్మన్ రఘురామకృష్ణం రాజు. ఈయన ఇండ్-భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్, ఇండ్-భారత్ పవర్ ఇన్ఫ్రా (ఐబీపీఐఎల్), ఇండ్ భారత్ ఎనర్జీ (ఉత్కల్)లిమిటెడ్ .. ఇలా ఎక్కడ పవర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే.. అక్కడ కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇలా దాదాపుగా పన్నెండు కంపెనీలు ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తామంటూ… ఈ కంపెనీలు దేశవిదేశాల్లోని వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. భారత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ , రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ , ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రూ. వెయ్యి కోట్లు రుణాలు తీసుకున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ప్రాజెక్టులు నిర్మించలేదు. తీసుకున్న రుణాలన్నీ దారి మళ్లించారు. ప్రాజెక్టుల్లో 20 శాతం కూడా నిర్మాణం కాలేదు. ఈ రుణాలు 2016లోనే మొండి బకాయిలుగా మారాయి. ఈ సంస్థ ఫిర్యాదు మేరకు.. రఘురామకృష్ణంరాజుపై.. ఢిల్లీలో కేసు నమోదు అయింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన అసెట్ మెనేజ్ మెంట్ కంపెనీ.. మెక్క్వరీ కూడా.. దాదాపుగా రూ. 800 కోట్లు ఇండ్ భారత్ కంపెనీలు ఎగ్గొట్టాయని భారత కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసి ఉన్నాయ.ి రఘురామకృష్ణం రాజు పెట్టిన కంపెనీల్లో ఓ రెండు కంపెనీలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి తీసుకున్న రూ.167 కోట్ల రుణం తిరిగి చెల్లించడంలో విఫలమమయ్యాయి. సరఫరా చేసిన బొగ్గుకు జరపడంలో విఫలమయ్యాయని గాంధార్ ఆయిల్ రిఫైనరీ కూడా.. కోర్టుల్లో కేసులు దాఖలు చేసింది.
ఈ మొత్తం రుణాలు, ఎగవేతల వ్యవహారం.. దాదాపుగా రూ. 3వేల కోట్లు ఉంటుంది. ఈ కేసులన్నీ ఇప్పుడు కోర్టులతో పాటు.. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ వద్ద ఉన్నాయి. రుణాలు ఇచ్చిన కంపెనీలన్నీ… ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై తదితర చోట్ల కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఆయాకంపెనీలను దివాలా తీసినట్లు ప్రకటించి.. తమ సొమ్ము తాము రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీల ఆస్తుల క్రయ విక్రయాలపై నిషేధం ఉంది. ఆస్తులకు సంబంధించి తాకట్టులు విడిపించడం, కోర్టు తీర్పులను అమలు చేయడం, కోర్టుల్లో కేసులు దాఖలుచేయడం వంటి చర్యలు చేపట్టకకూడదు. తేడా వస్తే.. ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కొసమెరుపేమిటంటే.. ఈయన కంపెనీలన్నీ.. వైఎస్ సీఎం అయిన తర్వాతే సృష్టించారు. ఆ తర్వాత రుణాలు పరుగులు పెట్టుకుటూ వచ్చాయి. వాటిని ఎగ్గొట్టడం కూడా అంతే వేగంగా జరిగిపోయాయి. ఈయన వైఎస్ ఆత్మగా పేరు పొందిన కేవీపీకి వియ్యంకుడు. గతంలో సీబీఐ అధికారులు, ఈడీ కూడా దాడులు చేసింది. తర్వాత సైలెంటయిపోయాయి. ఇక వైసీపీలో చేరడానికి ఆయనకు ఈ ఒక్క కారణం సరిపోతుందేమో..?.