టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ ను రూపొందించిన ఐటీ గ్రిడ్ కంపెనీపై పోలీసుల అత్యుత్సాహం హైకోర్టు చివాట్ల వరకూ వెళ్లింది. ఏపీ ఓటర్ల డేటా లీక్ అయిందంటూ.. వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, తెలంగాణకు చెందిన వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారంటూ.. హైదరాబాద్ పోలీసులు శనివారం అర్థరాత్రి.. సదరు కంపెనీపై దాడి చేసి నలుగురు ఉద్యోగుల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ అది అధికారికంగా అరెస్ట్ చూపించలేదు. వారి ఆచూకీ తెలియడం లేదని కంపెనీ గుంటూరులో కిడ్నాప్ కేసు పెట్టింది. మరో వైపు.. కంపెనీ ఉన్నత ఉద్యోగి.. హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఆదివారం, రేపు శివరాత్రి సందర్భంగా సెలవులు ఉండటంతో.. న్యాయమూర్తిని ఇంటి దగ్గరే విచారించాలని పిటిషనర్ కోరారు. దాంతో.. న్యాయమూర్తి తన ఇంటి దగ్గరే విచారణ జరిపారు.
హైకోర్టు న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు తెలంగాణ పోలీసులు తెల్లమొహం వేశారు. ఆ నలుగురు ఉద్యోగులు నిందితులా అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే.. పోలీసులు సాక్షులుగా చెప్పారు. సాక్షుల్ని అరెస్ట్ చేయాలని ఎక్కడ ఉందని.. హైకోర్టు ప్రశ్నిస్తే.. వారికి ముందుగానే నోటీసులిచ్చామని తెలంగాణ పోలీసులు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి సాక్షులుగా నిర్దారించడానికి మీ దగ్గరున్న కేసు రికార్డులు ఇవ్వమంటే.. పోలీసులు … వీఆర్వో సంతకం చేసిన.. తెల్ల కాగితాలు మాత్రమే చూపించగలిగారు. నిబంధనల ప్రకారం… ఒక వ్యక్తి లేదా సంస్థ పై సోదాలు నిర్వహించినప్పుడు.. సోదాలు పూర్తయిన తర్వాత ఏమేమీ స్వాధీనం చేసుకున్నామో తెలియజేస్తూ ఓ రికార్డు తయారు చేసి వీఆర్వో సంతకం తీసుకోవాలి. కానీ ఇక్కడ పోలీసులు ముందుగానే వీఆర్వో దగ్గర నుంచి సంతకం తీసుకున్నారు. ఇలా చేయడం వల్ల పోలీసుల దురుద్దేశం అర్థం అవుతోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఐటీ గ్రిడ్‌కు చెందిన నలుగురు ఉద్యోగుల్ని ఉదయం పదిన్నర కల్లా తన ముందు ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు.
మరో వైపు ఈ కేసు వ్యవహారం కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ తమ పార్టీకి చెందిన డేటాను మొత్తం చోరీ చేసి.. వైసీపీకి అందివ్వడానికి కేసీఆర్ ప్రభుత్వం ఇలా కుట్ర చేసిందని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేవలం ఉద్యోగుల్ని అన్యాయంగా అదుపులోకి తీసుకోవవడంపైనే… హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మంగళవారం.. ఎలాంటి ఆధారాలు లేకుండా.. తమ కంపెనీపై పోలీసులు దాడులు చేసి డేటా సేకరించే ప్రయత్నం చేశారన్న ఆరోపణతో.. కంపెనీ కూడా.. పోలీసులపై పిటిషన్ దాఖలు చేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐటీ గ్రిడ్‌పై సోదాల వ్యవహా తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో దాదాపు గంటపాటు చర్చించారు. న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.