తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ, లోక్ సభ ఎన్నికలకు కొత్త జోష్ తో ముందుకు సాగాల్సిన సమయం ఇది. కానీ, ఆ పార్టీలో ఎప్పటిమాదిరిగానే నాయకుల మధ్య సయోధ్య సమస్య మరోసారి తెరమీదికి వచ్చింది. ఆదివారం జరిగిన సీఎల్పీ భేటీ నుంచి అర్ధంతరంగా బయటకి వచ్చేశారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన నియోజక వర్గంలో సన్నిహిత నేత మరణ వార్త తెలియగానే అక్కడికి వెళ్లాల్సి ఉందని బయలుదేరారు. అయితే, వెళ్తూ వెళ్తూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై కొన్ని విమర్శలు చేసి వెళ్లారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డామనీ, టిక్కెట్లు ప్రకటించడం ఆలస్యం, పొత్తుల విషయం నెలలకొద్దీ సాగడం, ఆఖరి నిమిషం వరకూ అభ్యర్థులపై స్పష్టత ఇవ్వకపోవడం, తెలుగుదేశం పార్టీతో పొత్తు… ఇలాంటి కారణాల వల్ల అధికారం కోల్పోయామన్నారు కోమటిరెడ్డి. ఇక ముందు ఇలాంటి తప్పులు జరగకుండా పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనేదే తాను మాట్లాడాను అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రస్తుత నాయకత్వాన్ని మార్చాలనీ, పార్లమెంటు ఎన్నికలకు కూడా ఇదే నాయకత్వంపై పార్టీ బాధ్యతలు పెట్టడం సరికాదన్నారు. ఇదే నాయకత్వం కొనసాగితే పార్టీ కేడర్ కు జోష్ వచ్చే అవకాశం కనిపించడం లేదనీ, కాబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే మార్చాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరైతే నాయకత్వం వహించారో, వారందరినీ పక్కన పెట్టాలని డిమాండ్ చేశారు.
వాస్తవానికి, ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలనూ పార్టీ నుంచి బయటకి వెళ్లనీయకుండా జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. కానీ, పార్టీలో ఉన్న నేతలే ఇలా నాయకత్వంపై విమర్శలు చేస్తుండటం లోక్ సభ ఎన్నికల ముందు మంచి పరిణామంగా కనిపించడం లేదు. వాస్తవానికి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డి ఇలానే రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాను ఉద్దేశించి మాట్లాడుతూ… తెలంగాణ కాంగ్రెస్ కు ఆయన శనిలా దాపురించారనీ, ఒక బ్రోకర్ ని తీసుకొచ్చి రాష్ట్ర నాయకత్వం అని పెడితే ఉపయోగం ఏముంటుందనీ, వార్డు మెంబర్లుగా గెలవలేనివారిని టిక్కెట్లు ఇచ్చారనీ తీవ్ర పదజాలంతోనే విమర్శించారు. పీసీసీ నాయకత్వంపై కోమటిరెడ్డి సోదరుల అసంతృప్తి ఎప్పట్నుంచో ఉన్నదే. పీసీసీ నాయకత్వం తమకు ఇస్తే, కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తామంటూ గతంలో హైకమాండ్ ను ఈయన డిమాండ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు మరోసారి సందర్బం వచ్చింది కాబట్టి… నాయకత్వం మార్పు అంశాన్ని తెరమీదికి తెచ్చారని అనుకోవచ్చు. మరి, ఇది హైకమాండ్ వరకూ వెళ్తుందా, అక్కడి నుంచి ఎలాంటి సంకేతాలు వస్తాయనేది వేచి చూడాలి.