పుల్వామా ఘటన, సరిహద్దుల్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్.. వీటిని రాజకీయం చెయ్యడం సరికాదని అందరూ అంటున్నారు. ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నామనే విమర్శలు సరికాదంటూ భాజపా నేతలు కూడా ఖండిస్తున్నారు. సైనిక చర్యలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోమని చెబుతూనే… పదేపదే అదే అంశంపై మాట్లాడుతున్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పుల్వామా ఘటనకు భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందనీ, సర్జికల్ స్ట్రైక్స్ – 2 చేసిందన్నారు. నియంత్రణ రేఖ అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిందన్నారు. ఈ కాల్పుల్లో దాదాపు 250 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని అమిత్ షా ప్రకటించారు!
పుల్వామా దాడి తరువాత సర్జికల్ స్టైక్స్ వద్దంటూ కొంతమంది అన్నారనీ, ఇలాంటప్పుడు దాడులు చేయడం సరికాదని ఇప్పుడూ కొంతమంది అభిప్రాయపడుతున్నారని అమిత్ షా చెప్పారు. దాడులు ఎప్పుడు జరిగితే ఏం, మనవైపు నష్టం వాటిల్లకుండా ఉగ్రవాదులను అణచివేశామన్నారు. ‘మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 250 మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చింది’ అని అమిత్ షా చెప్పారు. వాస్తవానికి, వాయుసేన దాడుల్లో దాదాపు 350 మంది చనిపోయారంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అమిత్ షా ఆ సంఖ్యను వందకి తగ్గించి చెబుతున్నారు.
తాజా దాడులను రాజకీయాలకు అస్సలు వాడుకోమని అంటూనే… ‘ఇది మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేయించిన దాడులు’ అంటూ నొక్కి చెప్పడాన్ని ఏమనాలి..? మూడు రోజుల కిందట, ఇండియా టుడే కాంక్లేవ్ లో అమిత్ షా మాట్లాడుతూ… కాశ్మీరు సమస్య ఇంత జఠిలం కావడానికి కారణం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. పరోక్షంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ ని ఎన్నికల ప్రచారానికి వాడుకోమనీ, మోడీ చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటే తమకు చాలన్నారు. ఆ లెక్కన మోడీ అభివృద్ధి ఒక్కటే ప్రచారానికి చాలనుకున్నప్పుడు… పదేపదే పుల్వామా ఘటన అనంతర పరిణామాలను ప్రస్థావించాల్సిన అవసరం ఏముంది..? సైనిక చర్యని మోడీ ప్రభుత్వం సాధించిన విజయంగా ప్రతీసారీ చెప్పుకోవాల్సిన పనేముంది..? వాయుసేన దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో అమిత్ షా లెక్కలు చెప్పాల్సిన అవసరం ఏముంది..?